Rahul Gandhi India China: పొరుగు దేశం చైనా మనపై యుద్ధానికి సిద్ధమవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోందని ఆరోపించారు. అసలు ముప్పేలేనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇదే విషయాన్ని తాను గడిచిన రెండేళ్లుగా చెబుతున్నానని తెలిపారు. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్ సెక్టార్ వద్ద ఇరు దేశాల సైనికుల ఘర్షణల నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. ఆయన చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' వంద రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో రాజస్థాన్‌లో విలేకరులతో మాట్లాడారు.
"చైనా నుంచి ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. వారు చొరబాటు కోసం కాదు.. యుద్ధం కోసం సన్నద్ధమవుతున్నారు. ఇదే విషయాన్ని రెండుమూడేళ్లుగా చెబుతున్నా. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా ఈ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి విషయాల్లో పట్టీపట్టనట్లు వ్యవహరించడం తగదు. అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌లో వారు ప్రమాదకరంగా సన్నాహాలు చేసుకుంటూ ఉంటే.. మన ప్రభుత్వం నిద్రపోతోంది" అని విమర్శించారు. "చైనా సన్నాహాలపై ఎవరి మాటా వినకూడదని ఈ ప్రభుత్వం అనుకుంటోంది. వారు ఉపయోగిస్తున్న ఆయుధ సంపత్తి, వారు చేస్తున్నది చూస్తుంటే యుద్ధానికి సిద్ధమవుతున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. కానీ మన ప్రభుత్వం ఈ విషయాన్ని దాస్తోంది" అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేయడం లేదని విమర్శించారు.