CHINA INDIA PROPOSAL: వాస్తవాధీన రేఖ వెంబడి అత్యంత కీలకమైన పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద బలగాల ఉపసంహరణకు చైనా ఒక అతి తెలివి ప్రతిపాదన తీసుకొచ్చింది. డ్రాగన్ దళాలు కొంచెం వెనక్కి తగ్గితే.. భారత్ దళాలు కొన్ని కిలోమీటర్లు వెనక్కి వెళ్లిపోవాలట.. ఈ ప్రతిపాదనను ఇటీవల చైనా విదేశాంగ మంత్రి న్యూదిల్లీకి వచ్చిన సమయంలో బయటపెట్టారు. భారత్ దీనిని తిరస్కరించింది.
ఏమిటీ ప్రతిపాదన:డ్రాగన్ ప్రతిపాదించిన దాని ప్రకారం.. తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్ సమీపంలోని పెట్రోలింగ్ పాయింట్ 15 వద్ద చైనా దళాలకు అత్యంత సమీపంలో ఉన్న భారత్ బలగాలు వెనక్కి వెళ్లాలి. పెట్రోలింగ్ పాయింట్ 16-17 మధ్య ఉన్న కరమ్ సింగ్ పోస్టు వద్దకు ఇవి వెళ్లిపోవాలి. అప్పుడు చైనా దళాలు కొంచెం తగ్గి వాస్తవాధీన రేఖ వెనక్కి వెళతాయట. వాస్తవానికి చైనా,భారత్ తమవిగా చెబుతున్న భూభాగాలు పీపీ15 వద్ద కలుస్తాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రతిపాదన ఆమోదిస్తే.. భారత్ 5 నుంచి 10 కిలోమీటర్లు వెనక్కి వెళ్లిపోవాలి. కానీ, చైనా మాత్రం కేవలం ఒక కిలోమీటరు వెనక్కి వెళితే చాలు. పెట్రోలింగ్ పాయింట్ భారత్‌ది అన్న దానిలో దశాబ్దాల తరబడి ఎటువంటి వివాదం లేదు. రెండేళ్ల క్రితం నుంచే చైనా దీనిని తనదిగా చెప్పుకోవడం మొదలుపెట్టింది. తాజాగా చైనా మంత్రి వాంగ్‌యీ పర్యటనలో ఈ ప్రతిపాదనను .. భారత్ చర్చకు కూడా స్వీకరించకుండా తిరస్కరించింది.
కమాండర్ల స్థాయి చర్చలకూ ఇదే అడ్డంకి:మార్చి 11న చుషూల్-మోల్దో సరిహద్దు భేటీ వేదిక వద్ద భారత్-చైనా మధ్య జరిగిన 15వ విడత చర్చల్లో మూడు వివాదాస్పద ప్రాంతాలైన డెప్సాంగ్ మైదానాలు, డెమ్‌చోక్, హాట్‌స్ప్రింగ్ పై పీటముడి వీడలేదు. ఇవి వ్యూహాత్మకమైనవి కావడంతో ఇరు దేశాలు పట్టువీడటం లేదు. ఈ చర్చల్లో ముఖ్యంగా చాంగ్ చెన్మో నది సమీపంలోని హాట్‌స్ప్రింగ్స్ (పెట్రోలింగ్ పాయింట్ 15) వద్ద వివాద పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి. డెప్సాంగ్‌పై చర్చలకు కూడా చైనా అంగీకరించలేదని ప్రచారం జరిగింది. అక్కడ ‘వై’జంక్షన్ ప్రాంతాన్ని పీఎల్‌ఏ దళాలు ఆక్రమించుకొని, భారత బలగాలను అత్యంత వ్యూహాత్మకమైన అయిదు పెట్రోలింగ్ పాయింట్ల వైపు వెళ్లనీయకుండా చేస్తున్నాయి. డెమ్‌చోక్ వద్ద దళాల ఉపసంహరణపై చర్చలకు కూడా డ్రాగన్ సానుకూలంగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు ప్రాంతాలతో పోలిస్తే హాట్‌స్ప్రింగ్స్‌కు పరిష్కారంపైనే ఎక్కువ ఆశలు ఉన్నాయి.
చైనా హాట్‌మిక్స్ ప్లాంట్ ఏర్పాటు:ఇక ఉత్తర భాగంలోని డెప్సాంగ్ మైదానాల వద్ద పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ఇక్కడ ఎప్పటి నుంచో పెట్రోలింగ్ చేస్తున్నభారత దళాలను.. పీపీ 10,11,11ఎ,12,13లకు వెళ్లనీయకుండా చైనా దళాలు అడ్డుకొంటున్నాయి. ఈ ప్రాంతంలో చైనా తాత్కాలికంగా హాట్‌మిక్స్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. పెట్రోలింగ్ పాయింట్ల రోడ్ల నిర్మాణం కోసమే దీనిని ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు.