తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి భారత్​కు చైనా విదేశాంగ మంత్రి - చైనా మంత్రి భారత పర్యటన

China foreign minister India: సరిహద్దులో ఉద్రిక్తతల తర్వాత తొలిసారి భారత్​లో పర్యటించనున్నారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ. ఈనెల 24 నుంచి పర్యటన చేపట్టనున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​తో భేటీ కానున్నట్లు సమాచారం.

China foreign minister India tour
భారత పర్యటనకు చైనా విదేశాంగ మంత్రి

By

Published : Mar 17, 2022, 3:04 PM IST

China foreign minister India: గల్వాన్‌లో హింసాత్మక ఘర్షణలు, వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు కొంత వరకు తగ్గుముఖం నేపథ్యంలో తొలిసారి భారత్‌లో పర్యటించనున్నారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ. ఈ నెల 24 నుంచి భారత్‌లో పర్యటించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ కానున్నారు వాంగ్‌ యీ. ఈ పర్యటనపై చైనా అధికార వర్గాలు అధికారికంగా ధ్రువీకరించకపోయినా.. భారత విదేశీ మంత్రిత్వ శాఖ వర్గాలు మాత్రం సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ద్వైపాక్షిక చర్చలను పునఃప్రారంభించాలని చైనా నుంచే ప్రతిపాదన వచ్చినట్లు పేర్కొన్నాయి.

ఈ ఏడాది చైనాలో జరగనున్న బ్రిక్స్ దేశాల సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కావాలని చైనా కూడా కోరుకుంటున్నట్లు సమాచారం. బ్రిక్స్ సమావేశానికి ముందు ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం కోసం ద్వైపాక్షిక చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలని చైనా కోరుకుంటోందని అధికార వర్గాలు తెలిపాయి. బ్రిక్స్‌లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి.

వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఏడాదిన్న కాలంలోనే పలు ప్రదేశాల్లో మూడు సార్లు భారత్‌- చైనా విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. మొదటిసారి 2020 సెప్టెంబర్‌లో ఎస్​సీఓ శిఖరాగ్ర సమావేశంలో మాస్కోలో సమావేశమయ్యారు. మాస్కో భేటీలోనే.. పశ్చిమ లదాఖ్‌లో ఉద్రిక్తతకు సంబంధించి ఇరు దేశాల మధ్య 5 అంశాలపై కీలక ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత గతేడాది జులై, సెప్టెంబరులో తజకిస్థాన్‌ రాజధాని దుషాన్‌బేలో సమావేశమయ్యారు విదేశాంగ మంత్రులు.

భాగస్వాములుగా ఉండాలని వ్యాఖ్య..

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దులో శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిరంతరం భారత్‌ చెబుతూవస్తోంది. భారత్‌, బీజింగ్‌ ఇరువురు ఒకరి శక్తిని మరొకరు వృథా చేయకుండా ఉమ్మడిగా లక్ష్యాలను సాధించేందుకు పరస్పరం సహకరించుకోవాలని ఇటీవల మీడియాతో చెప్పారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ. చైనా, భారత్‌లు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని వ్యాఖ్యలు చేశారు. చైనా మంత్రి ప్రకటన తర్వాతే.. మార్చి 11న జరిగిన ఇరు దేశాల కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.

ఉక్రెయిన్​ సంక్షోభంపై చర్చ..

ఈ పర్యటనలో చైనా విదేశాంగ మంత్రి భారత్‌తో పాటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లను కూడా సందర్శించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్న తరుణంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంపై కూడా చర్చకు రావచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:కొరియాలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 6 లక్షలకుపైగా కేసులు

ABOUT THE AUTHOR

...view details