చైనా.. సరిహద్దులో మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. వివాదాస్పద డోక్లామ్ పీఠభూమికి సమీపంలో రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. 2017లో జొంషైరి పర్వత పంక్తి వద్దకు రోడ్డు వేసేందుకు ఆ దేశం ప్రయత్నించగా.. దానిని విజయవంతంగా నిలువరించింది భారత సైన్యం. ఈ తరుణంలో భారత్, చైనా దళాల మధ్య దాదాపు రెండున్నర నెలలు ప్రతిష్ఠంభన ఏర్పడింది.
ఉపగ్రహ ఛాయాచిత్రాలతో బహిర్గతం
అయితే.. మూడేళ్ల తర్వాత మరోసారి దుష్టప్రయత్నానికి తెరతీసింది చైనా. అందులోభాగంగా మరో మార్గంలో రహదారి నిర్మాణం ప్రారంభించింది. టోర్సా నది ఒడ్డున మరో మార్గంలో రోడ్డువేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలలో వెల్లడైంది. ఈ రహదారి ఏకంగా 9 కిలోమీటర్ల మేర భూటాన్‌లోకి వెళ్లిందని ఆ దృశ్యాల ద్వారా తేలింది. అంతేకాకుండా.. టోర్సా నదీలోయ ప్రాంతంలో నిర్మాణ కార్యక్రమాలు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. డోక్లామ్ ప్రాంతానికి సమీపంలో సైనిక గోదాములు వెలిసినట్లూ నిరూపితమవుతోంది.