డ్రాగన్(China) తీరు ఏమాత్రం మారలేదు. ఒకపక్క శాంతి వచనాలు పలుకుతూనే మరోపక్క కయ్యానికి కాలుదువ్వుతోంది. తూర్పు లద్దాఖ్‌లోని మిగతా ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు సంప్రదింపులు జరుపుతూనే కవ్వింపు చర్యలకు చైనా దిగుతోంది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి చేరువలో భారీ స్థాయిలో యుద్ధవిమానాలతో విన్యాసాలు చేపట్టింది. ఈ చర్యలను భారత భద్రత దళాలు నిశితంగా గమనిస్తున్నాయి.
తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల(China) మధ్య ఏడాదిగా సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. ఘర్షణలు కూడా జరిగి, రెండువైపులా ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే. తీవ్ర చర్చల తర్వాత కొన్ని ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి మళ్లాయి. మిగతా ప్రాంతాల్లో ఉపసంహరణపై చర్చలు జరిగినా..ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో సంయమనం పాటించడానికి బదులు రెచ్చగొట్టే చర్యలకు చైనా దిగింది. భారత సరిహద్దులకు చేరువలో 20కిపైగా ఫైటర్ జెట్‌లతో ఇటీవల భారీ వైమానిక విన్యాసాలు చేపట్టింది. ఇందులో జె-11, జె-16 యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. గతేడాది భారత్‌తో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సమయంలో తమ సైన్యానికి మద్దతుగా వైమానిక కార్యకలాపాలు సాగించిన స్థావరాల కేంద్రంగానే తాజా విన్యాసాలు జరిగాయి. అందువల్ల ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కష్గర్, హోటాన్, ఎంగారి గున్సా, షిగాట్సే, లాసా గోంగ్కర్, నియంగిచి, చాండో పాంట్గా నుంచి ఈ విన్యాసాలు సాగాయి. ఆ సమయంలో చైనా జెట్‌లు హద్దులు దాటలేదని భారత వర్గాలు పేర్కొన్నాయి.
చైనా(China) వైమానిక దళం ఇటీవల ఈ స్థావరాలను భారీగా ఆధునికీకరించింది. యుద్ధవిమానాలను భద్రపరిచేందుకు వీలుగా బాంబులను తట్టుకునేలా కాంక్రీట్ షెల్టర్లు నిర్మించింది. రన్‌వేల నిడివిని పొడిగించడం, అదనంగా మానవ వనరులను మోహరించడం వంటివి కూడా చేపట్టింది. బలగాల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా పాంగాంగ్ సరస్సు వంటి ప్రాంతాల నుంచి తమ సైనికులను వెనక్కి తీసుకెళ్లినప్పటికీ, హెచ్‌క్యూ-9, హెచ్‌క్యూ-16 వంటి గగనతల రక్షణ వ్యవస్థలను అలాగే ఉంచింది.
ఇదీ చదవండి:బలగాల ఉపసంహరణకు చైనా సాకులు!
ఇదీ చదవండి:'చైనా.. అందుకు సహకరించాల్సిందే'