ఎల్ఏసీని అతిక్రమించి భారత భూభాగంలో చైనా గ్రామాలను నిర్మిస్తోందన్న వార్తలు పుకార్లేనని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్(CDS Bipin Rawat) తెలిపారు. చైనా వైఖరితో దేశ భద్రతకు భారీ ముప్పు తప్పదని పేర్కొన్న ఆయన.. వాస్తవాధీన రేఖ నుంచి సైనికులను వెనక్కి రప్పించేందుకు భారత్ ఇప్పట్లో చర్యలు తీసుకునే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి సన్నగిల్లుతున్న 'విశ్వాసం'.. పెరుగుతున్న 'అనుమానం' అడ్డుగా ఉన్నాయని తెలిపారు.
"భారత భూభాగంలో చైనా నూతన గ్రామాన్ని నిర్మిస్తోందనేది పూర్తి అవాస్తవం. అయితే చైనా వైపు ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి వాటిని నిర్మించుకుంది. సైనికులు నివసించేందుకు చైనా వీటిని నిర్మిస్తోందని భావిస్తున్నా. వారి కుటుంబాలను సైతం సులభంగా తీసుకొచ్చేందుకూ ప్రణాళికలు చేస్తూ ఉండొచ్చు.
---బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
భారత సైనికులు సరిహద్దుల్లో విధుల నుంచి ఏడాదికి రెండు, మూడుసార్లు స్వస్థలానికి వెళ్లేందుకు సెలవులు లభిస్తాయని.. కానీ చైనా సైనికులకు ఈ అవకాశం లేదని బిపిన్ రావత్ అన్నారు.
"చైనా సైనికులు ఒంటరిగా ఉంటున్నారు. ప్రధాన భూభాగానికి వేల మైళ్ల దూరంలో నివసిస్తున్నారు. కానీ మన సైనికులు చాలా సంతోషకరమైన స్థితిలో ఉండటం చైనా సైనికులు గమనిస్తున్నారు. వారు కూడా ఇళ్లకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు."
---బిపిన్ రావత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్