China Bridge At Kailash Range: 2020లో ఆగస్టులో తూర్పు లద్దాఖ్‌లోని కైలాస్ రేంజ్‌ను ఆక్రమించుకుని పాంగాంగ్ సరస్సు వద్ద భారత్ తమపై ఆధిపత్యం సాధించడం వల్ల చైనా దిద్దుబాటు చర్యలకు దిగింది. మరోసారి భారత్‌కు అలా దొరకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటోంది. సైనికులు, భారీ ఆయుధాలను తరలించేందుకు వీలుగా పాంగాంగ్ సరస్సు రెండు వైపులను కలుపుతూ వంతెన నిర్మాణం చేపట్టింది.
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌లో భారత్‌తో సరిహద్దు వివాదానికి తెరతీసి భారత్‌తో తరచూ కవ్వింపు చర్యలకు దిగుతున్న చైనా.. 2020 ఆగస్టులో భారత్ నుంచి ఎదురైన చేదు అనుభవంతో కొత్త ఎత్తులు వేస్తోంది. ఆ సమయంలో పాంగాంగ్ సరస్సుకు దక్షిణం వైపు ఉన్న కైలాస్ రేంజి పర్వత శిఖరాలను ఆక్రమించుకొని భారత్.. చైనా మెడలు వంచింది. కైలాశ్ రేంజిపై భారత్ ఆపరేషన్ చేపట్టాక చైనా సైన్యం సత్వరమే స్పందించి ప్రతిఘటించ లేకపోయింది. చైనా దళాలు అక్కడకు చేరుకోవడానికి కనీసం 24 గంటలకు పైగా సమయం పట్టింది. ఫలితంగా భారత దళాలు అక్కడ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాయి. అప్పటి నుంచి పాంగాంగ్ సరస్సు వద్ద భారత్ దూకుడు పెరిగిపోవడాన్ని జీర్ణించుకోలేని చైనా మరోసారి అలాంటివి జరగకుండా దిద్దుబాటు చర్యలకు దిగింది.
సరస్సు వద్ద చైనా భూభాగం వైపు ఓ వంతెన నిర్మాణం చేపట్టింది. చైనా ఆధీనంలోని ఖురాంక్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాలను అనుసంధానించేలా ఈ నిర్మాణం జరుగుతోంది.అత్యంత ఇరుకుగా ఉండే ఈ ప్రాంతంలో రెడిమేడ్ నిర్మాణ సామగ్రితో చైనా పనులు కొనసాగిస్తోంది. దీని ఉపగ్రహ చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఈ వంతెన పూర్తయితే.. చైనా దళాలు 180 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది.
ఖురాంక్ నుంచి రుడాంక్‌కు దాదాపు 50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించి చేరుకోవచ్చు. దాదాపు 130 కిలోమీటర్లు పొడవున్న పాంగాంగ్ సరస్సులో కొంత భాగం టిబెట్‌లో ఉండగా.. మరికొంత భాగం లద్ధాఖ్‌లో ప్రాంతంలో ఉంది. ఈ వంతెన సహా కైలాస్ రేంజ్ వద్ద భారత సైనికుల ఆపరేషన్లను అడ్డుకునేందుకు వివిధ రకాల ఇతర రహదారులను కూడా చైనా అభివృద్ధి చేస్తోంది.
భారత సరిహద్దులో చైనా జెండా