పైచిత్రంలో ఉన్న వీరి పేర్లు వాచస్పతి, వేదాంత్. రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన వీరిద్దరి వయసు చిన్నదే. కానీ, సంస్కృత పండితుల్లా అలవోకగా శ్లోకాలు వల్లెవేస్తున్నారు. తమ విశేష ప్రతిభతో జైపుర్‌లో అందరికీ సుపరిచితంగా మారారు. తొమ్మిదేళ్ల వాచస్పతి, పదేళ్ల వేదాంత్ తమ ప్రతిభతో అందరినీ ముగ్ధుల్ని చేస్తున్నారు. అమరకోశ, స్తోత్ర రత్నావళి, భగవద్గీత, రామచరిత మానస్ వంటి గ్రంథాల్లోని కఠినమైన పద్యాలను సైతం సులభంగా చెప్పేస్తున్నారు. కరోనా కాలంలో దొరికిన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని శ్లోకాలను నేర్చుకున్నారు ఈ బాలలు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ప్రేరణతో ఒక్కో పద్యం నేర్చుకుంటూ.. ఏకంగా పదిహేను వందల శ్లోకాలను కంఠస్తం చేశారు. ఇప్పటికీ సంస్కృత శ్లోకాలను రోజూ చదువుతున్నారు. ఉదయం స్కూల్‌కు వెళ్లే ముందు, రాత్రి పడుకునే ముందు పద్యాలు చదివి వినిపిస్తున్నారు.
వీరు కంఠస్తం చేసిన పద్యాలు సాధారణమైనవేం కాదు. చాలా మంది పండితులు సైతం పుస్తకాలు చూస్తూనే వీటిని చదువుతుంటారు. ఇక సాధారణ వ్యక్తులకు అయితే నోరు తిరగడం కూడా కష్టమే. అలాంటి కఠినమైన శ్లోకాలను, పద్యాలను అవలీలగా చదివేస్తున్నారు. ఇలా తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సోదరులను ఈటీవీ భారత్ పలకరించింది. కరోనా సమయంలో వేదాంత్ తండ్రి (వాచస్పతి బాబాయ్) శాస్త్రి కౌశలేంద్ర దాస్.. సంస్కృత పద్యాలు చదువుకోవాలని వీరిద్దరికీ సూచించారు. వీరి ప్రోత్సాహంతోనే పద్యాలు కంఠస్తం చేయగలిగినట్లు చెప్పారు బాలలు.