Children Sick in Bihar Diwas Program: పట్నాలో జరిగిన బిహార్ దివస్ వేడుకల్లో అపశ్రుతి నెలకొంది. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం.. చాలా మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఇందుకు ఫుడ్ పాయిజనే కారణమని తెలుస్తోంది. 156 మందికిపైగా పట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. బాధితుల్లో చాలామంది కడుపునొప్పి, వాంతులతో బాధపడినట్లు పేర్కొన్నారు. వీరంతా బిహార్ దివస్ వేడుకల కోసం వివిధ జిల్లాల నుంచి పట్నా వచ్చారు.
అందరికీ మంచి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు సివిల్ సర్జన్ డా. విభా సింగ్. విద్యార్థులు తిన్న ఆహారంతోనే సమస్య తలెత్తిందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ కోసం కలెక్టర్ ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేశారని వెల్లడించారు. అసలు ఇంతమంది ఎలా అనారోగ్యం బారినపడ్డారనే అంశంపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు స్పష్టం చేశారు. బిహార్ దివస్లో భాగంగా ప్రభుత్వం పట్నాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ వేడుకలు గురువారం ముగియనున్నాయి.