తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Third Wave: 'పిల్లలకు ముప్పు'పై ఆధారాల్లేవు! - పిల్లలపై మూడో దశ కరోనా ముప్పుపై ద లాన్సెట్‌ కథనం

'భారత్‌లో చిన్న పిల్లలకు కొవిడ్‌ ముప్పు' పేరుతో 'ద లాన్సెట్‌ కొవిడ్‌-19 కమిషన్‌ ఇండియన్‌ టాస్క్‌ఫోర్స్‌'లో భాగంగా ఓ కథనం ప్రచురితమైంది. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు వివిధ అంశాలను పరిశీలించి రూపొందించిన ఈ నివేదిక.. పిల్లలపై మూడో దశ కరోనా ముప్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. అదేసమయంలో వారి పౌష్టికాహారంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని తేల్చింది.

children has no threat of covid third wave says lancet journal
మూడో ఉద్ధృతి పిల్లలకు ముప్పుపై ఆధారాల్లేవు

By

Published : Jun 13, 2021, 6:43 AM IST

కరోనా మూడో ఉద్ధృతిలో పిల్లలకు బాగా ముప్పు ఉంటుందంటూ(Covid third wave in children) వ్యక్తమవుతున్న అభిప్రాయాలు వాస్తవం కాకపోవచ్చు. ఇలా చెప్పడానికి తగిన ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. 'ద లాన్సెట్‌' జర్నల్‌ ఆధ్వర్యంలో అధ్యయనం చేసిన నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. 'భారత్‌లో చిన్న పిల్లలకు కొవిడ్‌ ముప్పు' పేరుతో 'ద లాన్సెట్‌ కొవిడ్‌-19 కమిషన్‌ ఇండియన్‌ టాస్క్‌ఫోర్స్‌'లో భాగంగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు వివిధ అంశాలను పరిశీలించి నివేదిక రూపొందించారు. థర్డ్‌ వేవ్‌లో కేవలం పిల్లలకే అధిక ముప్పు ఉంటుందన్నది సరికాదని, అందరిలాగానే వారికీ ఆ ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడ్డారు. "చాలా మంది పిల్లల్లో వైరస్‌ లక్షణాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా అవి స్పల్పంగానే ఉంటాయి. ఎక్కువ మంది జ్వరం, శ్వాస సమస్య, విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వయసు పెరిగే కొద్దీ వైరస్‌ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి" అని ఆ నివేదికలో పేర్కొన్నారు.

ముప్పు రెండు శాతమే..

అయితే.. మొదటి రెండు దశల్లో వైరస్‌ బారినపడిన పిల్లల విషయమై జాతీయ స్థాయి గణాంకాలు అందుబాటులో లేవు. అయితే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, దిల్లీల్లోని పది ఆసుపత్రుల్లో నవజాత శిశువులు మినహా పదేళ్లలోపు పిల్లలు సుమారు 2,600 మంది చికిత్స పొందారు. వారికి అందించిన చికిత్సలను అధ్యయనం చేసిన తరువాత ఈ నిర్ణయానికి వచ్చారు. కరోనాకు గురయిన పిల్లల్లో 2.4% మరణాలు సంభవించాయి. అదే ఇతర రోగాలకు గురయిన వారిలో 40 శాతం మంది మరణించారు. ఆసుపత్రిలో చేరిన పిల్లల్లో 9 శాతం మందే తీవ్రమైన అస్వస్థతకు లోనయ్యారు. దీని ప్రకారం చూస్తే చిన్నపిల్లలకు ఉండే ముప్పు తక్కువేనని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరికొన్ని వివరాలను నివేదికలో పొందుపరిచారు. "వైరస్‌ సోకిన పిల్లల్లో 5 శాతం మందికే ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. వారిలో 2 శాతం మందికి వ్యాధి తీవ్రమై మరణించే ముప్పు కలగవచ్చు. అంటే లక్ష మందిలో 500 మందే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. వారిలో 2 శాతం అంటే లక్ష మందిలో ఒకరిద్దరు మాత్రమే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇతరత్రా వ్యాధులు లేకపోతే పిల్లల్లో మరణాలు ఉండకపోవచ్చు" అని నివేదికలో పేర్కొన్నారు. నిపుణుల బృందంలో ఎయిమ్స్‌ వైద్యులు షెఫాలీ గులాటీ, సుశీల్‌ కాబ్రా, రాకేశ్‌ లోధా ఉన్నారు.

సౌకర్యాలు పెంచాలి..
చిన్న పిల్లల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అన్ని స్థాయిల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది, ఆక్సిజన్‌, మందులు, ఇతర పరికరాలతో పాటు శిక్షణ పొందిన సిబ్బందిని ఉంచాలని సూచించింది. టీకాలు, పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలని తెలిపింది. పాఠశాలలను ప్రారంభించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

ఇవీ చదవండి:'టీకాలనూ తప్పించుకునే వైరస్‌ రకాలు'

Third wave: 'కరోనా మూడో దశ అనివార్యం'

'కరోనా మూలాలపై పారదర్శక దర్యాప్తు జరగాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details