children declared as gods: కేరళ వయానాడ్‌లో గిరిజనులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఓ జ్యోతిష్యుడిపై బాలల హక్కుల సంఘం, పోలీసులు దృష్టి సారించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పలువురు చిన్నారులను దేవుళ్లని చెప్తూ స్థానికుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఒక్కొక్క చిన్నారికి రూ.15,000 నుంచి రూ. 25,000 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. అయితే.. ఆ పిల్లలను దేవుళ్లుగా ప్రకటించిన తర్వాత వారిని బయటకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. దీంతో వారి చదువులు ఆగిపోతున్నాయి.
10వ తరగతి చదువుతున్న ఓ బాలిక.. పాఠశాలకు రాకపోవడంపై అధికారులు ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. ఇలా మూఢనమ్మకాల కారణంగా ఒక్క తిరునెల్లి పంచాయతీ పరిధిలో దాదాపు 25 మంది చిన్నారుల చదువులు నిలిచిపోయినట్లు అధికారులు దర్యాప్తులో గుర్తించారు. ఆ పదో తరగతి బాలికకు విశేష శక్తులు ఉన్నాయని జోతిష్యుడు స్థానికంగా ఉండే గిరిజనులను నమ్మించినట్లు పేర్కొన్నారు.