తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లల్లోనూ పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలు! - పోస్ట్ కొవిడ్ లక్షణాలు

చిన్నారులు సైతం పోస్ట్ కొవిడ్ లక్షణాల బారిన పడుతున్నారు. మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చైల్డ్‌ (MISC) లక్షణాలతో ఎక్కువ మంది చిన్నారులు బాధపడుతున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.

children, corona
కొవిడ్, చిన్నారులు

By

Published : Jul 13, 2021, 10:57 PM IST

కరోనా వైరస్‌ నుంచి కోలుకుంటున్న పెద్ద వయసువారే కాకుండా, చిన్నారులు కూడా పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలు, తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులతో ఆస్పత్రులను సంప్రదిస్తున్నారని దిల్లీ వైద్యులు చెబుతున్నారు. మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చైల్డ్‌ (MISC) లక్షణాలతో ఎక్కువ మంది చిన్నారులు బాధపడుతున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.

"అదృష్టవశాత్తు చిన్నారుల్లో కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపడం లేదు. కేవలం హృద్రోగ, కిడ్నీ సమస్యలతో పాటు ఆస్తమా లేదా ఊబకాయం ఉన్నవారు మాత్రమే ఆస్పత్రిలో చేరాల్సి వస్తోంది. కేవలం ఒకటి, రెండు శాతం కేసుల్లో మాత్రమే MISC ప్రభావం కనిపిస్తోంది. అయినా అది పెద్ద సంఖ్యే.. సరైన వైద్యం అందించడం ద్వారా వాటి నుంచి బయటపడవచ్చు" అని దిల్లీలోని ఫోర్టిస్‌ ఆస్పత్రిలోని చిన్నారుల విభాగాధిపతి డాక్టర్‌ రాహుల్‌ నాగ్‌పాల్‌ పేర్కొన్నారు. కానీ, డయేరియా, ఒళ్లునొప్పులు, జీర్ణాశయ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారని తెలిపారు. ఇక యుక్తవయసు పిల్లలు కూడా తీవ్ర తలనొప్పి సమస్యలతో ఆస్పత్రులను సంప్రదిస్తున్నారని.. ఇది పోస్ట్‌ కొవిడ్‌ లక్షణమా? లేదా? అనే విషయంపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని రాహుల్‌ నాగ్‌పాల్ అభిప్రాయపడ్డారు.

బ్రెయిన్ ఫాగింగ్..

మరికొంత మంది పిల్లలు బ్రెయిన్‌ ఫాగింగ్‌ సమస్యతో (చదివింది గుర్తుపెట్టుకోలేకపోవడం) బాధపడుతున్నారని ఉజాలా సైగ్నస్‌ ఆస్పత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్‌ సుచిన్‌ బజాజ్‌ వెల్లడించారు. వీటితో పాటు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, టాయిలెట్‌కు వెళ్లిన సమయంలోనూ శ్వాసక్రియ రేటు పెరగడం, తీవ్ర తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇలాంటి సమస్యలు మూడు నుంచి నాలుగు నెలలపాటు వారిని వేధిస్తున్నాయని అన్నారు.

ఇక చాలా మంది పిల్లలు స్వల్ప కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారని.. కోలుకున్న తర్వాత కూడా చాలారోజుల పాటు స్వల్ప జ్వరం, తలనొప్పి, అలసటగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఇంద్రప్రస్తా అపోలో ఆస్పత్రిలోని సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ నమీత్‌ జెరాత్‌ వెల్లడించారు. అంతేకాకుండా కొవిడ్‌ కారణంగా ఇళ్లకే పరిమితమైన పిల్లల్లో మానసిక సమస్యలు కూడా పెరుగుతున్నాయని మ్యాక్స్‌ ఆస్పత్రికి చెందిన చిన్నారుల విభాగాధిపతి డాక్టర్‌ శ్యామ్‌ కుక్రెజా స్పష్టంచేశారు. అయినప్పటికీ కొవిడ్‌తో వారి ఇళ్లలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయినవారు ఉంటే, అలాంటివారు ఆస్పత్రులకు రావడానికే వణికిపోతున్నారని చెప్పారు. సెకండ్‌ వేవ్‌ తర్వాత దాదాపు 50 MISC కేసులు వచ్చాయని డాక్టర్‌ కుక్రెజా పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ముగ్గురు చిన్నారులు మృతి.. మూడో దశకు ఇది సంకేతమా..?

ABOUT THE AUTHOR

...view details