Tragedy In Nizamabad : లే నాన్నా.. లే ఇంటికి వెళదాం.. అంతా చీకటిగా ఉంది.. నాకు భయం వేస్తుంది. అమ్మ కావాలి.. లే.. తొందరగా ఇంటికి పోదాం.. నాన్నా.. నాన్నా.. అంటూ ఓ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. ఎంత పిలిచినా.. నాన్న ఎందుకో లేవట్లేదు. ఇంట్లో నిద్రించినప్పుడు ఒక్క పిలుపుతో డాడీ అంటూ లేచే నాన్న.. ఇప్పుడు ఎందుకో ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయాడు. చుట్టూ దట్టమైన అడవి.. చిమ్మ చీకటి కమ్మి ఎటుచూసిన శూన్యమే కనిపిస్తోంది. వచ్చీపోయే వాహనాల శబ్ధాలు వినిపిస్తున్నా.. నాన్న నుంచి దూరంగా వెళ్లి ఆ బళ్లను ఆపాలంటే భయం.. ఏం చేయాలో పాలుపోక.. నాన్నకు ఏమయ్యిందో తెలీక రాత్రంతా ఆ చిన్నారి అలానే ఏడుస్తూ ఏడుస్తూ తండ్రి మృతదేహం పక్కనే నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం ఓ పూజారి గమనించేంత వరకు అలానే తండ్రి పక్కనే నిద్రించాడు. ఈ హృదయ విదారకమైన ఘటన నిజామాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.
అదుపు తప్పిన బైక్.. తండ్రి మృతి : నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం వెంగల్పాడ్ గ్రామానికి చెందిన మాలవత్ రెడ్డి.. తన మూడేళ్ల కుమారుడు నితిన్‌తో కలిసి జూన్ 21న కామారెడ్డి జిల్లా యాచారంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి ద్విచక్ర వాహనాంపై తిరిగి వస్తుండగా.. సదాశివనగర్ మండలం దగ్గి అటవీ ప్రాంతంలోని 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న బారికేడ్‌ను బలంగా ఢీ కొట్టారు. దీంతో ఒక్కసారిగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి.. తండ్రీ కుమారులిద్దరూ రోడ్డు పక్కన పడిపోయారు. తండ్రి తలకు బలమైన గాయం కావడంతో.. అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలియని చిన్నారి.. తండ్రిని లేపేందుకు యత్నించి.. రోదిస్తూ తండ్రి మృతదేహం పక్కనే నిద్రపోయాడు.