Child Stuck In Borewell : ఒడిశాలోని సంబల్పుర్లో వాడకంలో లేని బోరుబావిలో చిక్కుకున్న నవజాత శిశువును రెస్క్యూ బృందాలు ఐదు గంటలపాటు శ్రమించి రక్షించాయి. వెంటనే ఘటనాస్థలి సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో నవజాత శిశువును సంబల్పుర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
సంబల్పుర్ జిల్లా లారిపలి గ్రామంలోని ఉపయోగంలో లేని బోరుబావిలో నవజాత శిశువు చిక్కుకుంది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు 15-20 అడుగుల లోతులో చిక్కుకున్న శిశువుకు ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. ఫైర్ సిబ్బంది, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఐదు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి సురక్షితంగా కాపాడాయి.
శిశువును బోరుబావిలో పడేశారని అనుమానం!
అంతకుముందు, బోరు బావిలో చిన్నారి ఉన్నట్లు స్థానికులు గుర్తించారని పోలీసులు చెప్పారు. వారి అందించిన సమాచారంతోనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శిశువు తల్లిదండ్రులెవరో ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. వాడకంలో లేని బోరుబావి గ్రామానికి సమీపంలోని అడవిలో ఉందని, శిశువు అందులో ఎందుకు చిక్కుకుందో తెలియాల్సి ఉందన్నారు. పసికందును ఎవరో బోరుబావిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు మృతి
Boy Fell Into Borewell : మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పుర్‌లో బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అసలేం జరిగిందంటే?
ఖండాలా దావ్రి గ్రామానికి చెందిన విజయ్ అనే రెండేళ్ల బాలుడు మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. దీంతో బాలుడి తండ్రి దినేశ్ వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న అలీరాజ్‌పుర్ కలెక్టర్ డాక్టర్ అభయ్ బెడేకర్, అలీరాజ్‌పుర్ ఎస్పీ రాజేష్ వ్యాస్ సహా ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని గంటల పాటు శ్రమించి బోరుబావికి సమాంతరంగా జేసీబీలతో తవ్వకాలు జరిపి బాలుడ్ని బయటకు తీశారు. వెంటనే అధికారులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కాగా, బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
బోరు బావిలో పడిన బాలుడి కోసం రెస్క్యూ ఆపరేషన్