CRY Awareness Program About Child Labour: ఆంధ్రప్రదేశ్‌లో ఇతర జిల్లాలతో పోల్చినపుడు బాల కార్మికులు అధికంగా ఉన్న ఐదు జిల్లాలు విశాఖపట్నం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 'చైల్డ్ రైట్స్ అండ్ యు' తన భాగస్వామ్య సంస్థలతో కలిసి జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. ‘‘పిల్లలను పనిలో పెట్టుకోవటం ద్వారా వారికి సాయం చేయొద్దు’’ అనే నినాదంతో చైల్డ్ రైట్స్ అండ్ యు జాతీయ స్థాయిలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన కార్యాచరణను ప్రజలకు చేరవేయటానికి కృషి చేస్తోంది. ఇందుకోసం ఏడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ క్రమంలో ప్రతి చిన్నారీ పనికి కాకుండా పాఠశాలకు వెళ్లేలా చూడటానికి స్థానిక, జిల్లా స్థాయి యంత్రాంగంతో కలిసి పని చేయటం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు చైల్డ్ రైట్స్ అండ్ యు తెలిపింది.
ఆందోళనకరంగా పరిస్థితి :బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలో నిరంతర సమస్యగానే కొనసాగుతోంది. బాల కార్మికులపై యునిసెఫ్, అంతర్జాతీయ కార్మిక సంస్థ విడుదల చేసిన "చైల్డ్ లేబర్ గ్లోబల్ ఎస్టిమేట్ 2020 ట్రెండ్స్ అండ్ ది రోడ్ ఫర్ ఫార్వర్డ్" ప్రకారం, "2020 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది చిన్నారులు (5 నుండి 17 సంవత్సరాల వయసు పిల్లలు) అందులో 6.3 కోట్ల మంది బాలికలు, 9.7 కోట్ల మంది బాలురు బాల కార్మికులుగా ఉన్నట్లు అంతర్జాతీయ అంచనాలు సూచిస్తున్నాయి’’ కాగా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న కిశోర బాలబాలికల సంఖ్య 11,86,285 గా ఉంది.