Child Fell Into Borewell in Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి మరణించింది. బోరుబావి నుంచి బయటకు తీసిన తర్వాత ఆస్పత్రికి తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మరణించింది. 25 అడుగుల లోతైన బోరుబావిలో పడిన చిన్నారిని బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు సురక్షితంగా బయటకు తీశారు అధికారులు. సుమారు 9 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ చిన్నారిని బయటకు తీసిన ప్రయోజనం లేకుండా పోయింది.
ఇదీ జరిగింది
రాజ్‌గఢ్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారి మహీ ఆడుకుంటూ వెళ్లి పొలంలో ఉన్న 25 అడుగుల బోరుబావిలో పడిపోయింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో బోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్లియా రసోడా గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ క్రమంలో ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్, రాజ్‌గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్, రాజ్‌గఢ్ ఎస్పీ ధరమ్‌రాజ్ మీనా ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాలికను రక్షించేందుకు జేసీబీ, ఇతర పరికరాలను రప్పించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని బోరుబావి లోపల చిక్కుకున్న చిన్నారికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేశారు. దాదాపు 9 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసిన అధికారులు, బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు బయటకు తీశారు. అనంతరం వెంటనే భోపాల్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించింది.
సీఎం ట్వీట్
అంతుకుముందు చిన్నారి బోరుబావిలో పడిపోవడంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరంగా చేయాలని అధికారులను ఆదేశించారు. 'ఎస్డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం బాలికను సురక్షితంగా బోర్వెల్ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. బాలికను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే ఏ అవకాశాన్ని వదులుకోము' అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.