ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు ఓ 12 ఏళ్ల బాలుడు. ఈ సంఘటన జాంజ్గీర్ చాంపా జిల్లా, మాల్ఖరోదా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిహరీద్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఇంటి వద్ద తమ కుమారుడు కనిపించటం లేదని వేతుకుతుండగా.. బాలుడి అరుపులు విని బోరుబావిలో పడిపోయినట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. వెంటనే 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. బాలుడు రాహుల్ సాహూగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. 'పిహరీద్ గ్రామంలో బోరు బావిలో పడిపోయిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం. కలెక్టర్, జిల్లా ఎస్పీ సంఘటనాస్థలంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. రాహుల్ సురక్షితంగా బయటపడాలని ప్రతిఒక్కరు ప్రార్థించాలి.' అని పేర్కొన్నారు.