కేరళలో దారుణం జరిగింది. కదులుతున్న రైలులో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. తన తోటి ప్రయాణికుడికి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు. ఈ దారుణం కోజికోడ్ జిల్లా ఎలత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు కోజికోడ్ నగరం దాటి.. కొరపుజా రైల్వే వంతెన వద్దకు చేరుకుంది. రాత్రి 9.45 గంటలకు డీ1 కాంపార్ట్‌మెంట్‌లో ఎర్ర చొక్కా, టోపీ ధరించి ఉన్న ఓ వ్యక్తి.. తోటి ప్రయాణికులపై రెండు బాటిళ్ల పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో డీ1 బోగీలో చెలరేగిన మంటలు డీ2 కంపార్ట్‌మెంట్‌కు కూడా వ్యాప్తించాయి. భయాందోళనకు గురైన ప్రయాకులు ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును ఆపారు. కొందరు రైలులోంచి కిందకు దూకే ప్రయత్నం కూడా చేశారు. అనంతరం దాదాపు 35 ఏళ్ల వయసున్న నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
9 మంది క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి.. తన బంధువులు ఓ చిన్నారి, మరో మహిళ మహిళ కనిపించడం లేదని అన్నాడు. చిన్నారి, మరో మహిళ మిస్సింగ్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు రైలు పట్టాలను పరిశీలించారు. ఆదివారం అర్ధరాత్రి ఎలత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై ఓ చిన్నారి, మహిళ సహా మధ్య వయస్కుడైన మరో వ్యక్తి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వీరంతా రైలుకు మంటలు అంటుకున్నాయనుకుని.. రైలులోంచి దూకేశారా? లేదా రైలులోంచి దిగే ప్రయత్నంలో కిందపడి చనిపోయారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్థానిక సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ సేకరిస్తోంది. కాగా, ట్రైన్ నిందితుడికి సంబంధించిన ఓ బ్యాగ్ లభ్యమైందని.. కానీ అందులో ఓ పెట్రోల్ బాటిల్ తప్ప ఇంకేమీ లేదని రైల్వే పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్లో కొంతమందికి 50 శాతం.. కాలిన గాయాలయ్యాయని.. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
చనిపోయిన మహిళ, చిన్నారిని మట్టన్నూరు పాలోట్ పల్లికి చెందిన రహ్మత్(43), ఆ మహిళ సోదరి కుమార్తె(2)గా పోలీసులు గుర్తించారు. మూడో వ్యక్తిని ఇంకా గుర్తించలేదు. ఈ ఘటనలో గాయపడిన వారిని కతిరూర్కు చెందిన అనిల్ కుమార్(50), అతడి భార్య సజిషా (47), కుమారుడు అద్వైద్ (21), త్రిసూర్‌కు చెందిన అశ్వతి (29), మట్టనూర్ వాసి రసిక్ (27), తాలిపరం వాసులు రూబీ (52), జోతీంద్రనాథ్ (50), త్రిసూర్‌కు చెందిన ప్రిన్స్ (39), కన్నూర్ వాసి ప్రకాశం (52)గా పోలీసులు గుర్తించారు.