child died lemon stuck in throat : ఏడేళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డ పుట్టడంతో ఆ దంపతులు మురిసిపోయారు. చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. బుడిబుడి అడుగులు వేస్తుంటే చూసి మురిసిపోయేవారు. కానీ, వారి ఆనందం ఎంతో దూరం నిలవలేదు. విధికి కన్ను కుట్టిందేమో..! ఊహించని ప్రమాదంలో ఆ చిన్నారి కన్నుమూసింది.
ఇంటి వద్దే కాచుకున్న మృత్యువు - మూడేళ్ల బాలుడిని మింగేసిన విద్యుత్ స్తంభం
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో ఓ చిన్నారి కన్నుమూసింది. గ్రామానికి చెందిన వాలంటీరు సఖీదీప, గోవిందరాజు దంపతుల కుమార్తె జశ్విత (9నెలలు) ఆడుకుంటూ నిమ్మకాయను నోట్లో పెట్టుకుంది. తల్లి గమనించి దాన్ని తీసేందుకు ప్రయత్నించగా గొంతులోకి జారుకుంది. చికిత్స కోసం హుటాహుటిన పెద్దవడుగూరు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే శ్వాస అందక తీవ్ర ఇబ్బంది పడింది. మెరుగైన వైద్యం కోసం పామిడికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పసికందు మృతితో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నారి మృతదేహంపై పడి బోరున విలపించారు. ఏడేళ్ల తర్వాత పుట్టిన బిడ్డను లేకుండా చేశావా దేవుడా అంటూ గుండెలు పగిలేలా రోదించారు.
పుట్టినరోజునే తిరిగిరాని లోకాలకు.. స్కూల్లో తల మీద బండ పడి చిన్నారి మృతి