Child Died Due To Suffocation Due To Buffalo Dung His Face : మొహంపై గేదె పేడ వేయటం వల్ల ఊపిరిరాడక ఆరునెలల చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఎలా జరిగిందంటే?
ఇదీ జరిగింది
కుల్పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సతారి గ్రామానికి చెందిన ముఖేశ్ యాదవ్, అతడి భార్య నికిత వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆ దంపతులకు యాదవేంద్ర (3), ఆయుష్ (6 నెలలు) అనే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అయితే బుధవారం సాయంత్రం నికిత, గేదేలకు మేత వేసేందుకు వెళ్లింది. అదే సమయంలో ఆయుశ్ ఏడవటం మొదలు పెట్టే సరికి చిన్నారిని తీసుకెళ్లి పశువుల పక్కనే ఉన్న ఊయలలో పడుకోబెట్టింది.
ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిన నికిత పనులు చేసుకుంటూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత వచ్చి చూసే సరికి ఆయుశ్ ముఖంపై పేడ ఉంది. ఆయుశ్ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆయుశ్‌ను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ముఖంపై పేడ ఉండటం వల్ల ఊపిరాడక మరణించినట్లు జిల్లా ఆస్పత్రి మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ పంకజ్ రాజ్‌పుత్ తెలిపారు. అయితే పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.