Child Died After a Car Ran Over :అపార్ట్మెంట్ ఎదురుగా ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో డిసెంబర్ 9న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
కసువినహళ్లి పరిధిలోని సమృద్ధి అపార్ట్మెంట్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. నేపాల్‌కు చెందిన జోగ్ జుథర్, అనిత దంపతుల చిన్నారి అర్బినా అపార్ట్మెంట్ గేటు ఎదురుగా ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి చిన్నారిని గమనించకుండా కారును వెళ్లనిచ్చాడు. ఆ తర్వాత చిన్నారిని ఏడవడాన్ని గమనించిన తల్లిదండ్రులు గేటులో ఇరుక్కుపోయి ఏడుస్తోందని భావించారు. ఆ తర్వాత సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, చిన్నారి భుజం విరిగిపోయిందని చెప్పారు. దీంతో మెరుగైన చికిత్స కోసం సంజయ్ గాంధీ ఆస్పత్రికి తీసకెళ్లారు తల్లిదండ్రులు. ఆ తర్వాత అక్కడి నుంచి నింహన్స్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు వైద్యులు. ఈ క్రమంలోనే అక్కడికి తీసకుని వెళ్తుండగా దారిలోనే మరణించింది.
అనంతరం పోస్టుమార్టం పరీక్ష నిర్వహించగా, అంతర్గతం రక్తస్రావం జరిగి మరణించిందని తేలింది. ఈ ఘటనపై డిసెంబర్ 10న బెల్లందూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు చిన్నారి తల్లిదండ్రులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. చిన్నారి పైనుంచి కారు వెళ్లడం వల్లే ఘటన జరిగినట్లు తేలింది.