కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇప్పట్లో స్పష్టత వచ్చేలా కనిపించటం లేదు. భాజపా ప్రభుత్వ పగ్గాలు చేపట్టి జులై 26తో రెండేళ్లు పూర్తి అవుతుంది. ఈ క్రమంలోనే పార్టీ విజయోత్సవ కార్యక్రమం వేదికగానే సీఎం యడియూరప్ప రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అందులో భాగంగానే.. జులై 25న పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు విందు, 26న పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారని అంతా అనుకున్నారు. అయితే.. తాజాగా ఈ రెండు కార్యక్రమాలను వాయిదా వేశారు యడియూరప్ప.
పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు విందు కార్యక్రమం మరోరోజు నిర్వహించనున్నట్లు యడియూరప్ప సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమ ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. జులై 27న లేదా.. ఆ తర్వాత ఏప్పుడైనా నిర్వహించే వీలుందని తెలిపారు.
ఇటీవలే దిల్లీ వెళ్లిన.. యడియూరప్ప.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రిపై పార్టీ కరసత్తు చేస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే.. దిల్లీ నుంచి తిరిగొచ్చాక..అలాంటి వాదనలు తిప్పికొట్టారు యడ్డీ. తననే కొనసాగాలని అధిష్ఠానం కోరినట్లు చెప్పుకొచ్చారు.