CJI Ramana on Media:ఝార్ఖండ్ హైకోర్టులో జస్టిస్ సత్య బ్రత సిన్హా స్మారకార్థం ఏర్పాటు చేసిన సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ ఉపన్యాసంలో ప్రస్తుతం మీడియా పోకడలు, సామాజిక మాధ్యమాల తీరుపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రచారం చేస్తున్న ఏకపక్ష అభిప్రాయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ ప్రచారం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని వ్యవస్థకు హాని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయం తీసుకోవడానికి కష్టంగా ఉన్న సమస్యలపై మీడియా 'కంగారూ కోర్టు'లను నడుపుతోందని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పులపై అవగాహన లేకుండా సమస్యలపై ఒక అజెండాతో నడిచే చర్చలు ప్రజాస్వామ్యానికి హానికరమని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
"మీడియా 'కంగారూ కోర్టు'లను నడుపుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. దీనివల్ల కొన్ని సమయాల్లో అనుభవాజ్ఞులైన న్యాయమూర్తులు కూడా నిర్ణయం తీసుకునేందుకు ఇబ్బంది పడాల్సివస్తోంది. కోర్టు తీర్పుల అంశంపై అవగాహన లేకుండా ఒక అజెండాతో నడిచే చర్చలు ప్రజాస్వామ్యానికి హానికరం. మీడియా తన బాధ్యతలను అతిక్రమించి, నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తోంది. ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంతవరకు జవాబుదారీతనం ఉంది. కానీ ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనమే లేదు. మీడియా స్వీయ నియంత్రణ, పదాల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీడియా ప్రధానంగా ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. మీడియా తన వాణిని ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రగతిశీల, సుసంపన్న, శాంతియుత భారత నిర్మాణం కోసం వినియోగించాలి."
-జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
CJI Ramana TV debate:కొన్ని ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో.. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయన్న సీజేఐ.. ఈ విషయంలో ప్రభుత్వం, కోర్టుల నుంచి జోక్యం చేసుకునే పరిస్థితి రాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ఈ అంశాలపై జడ్జీలు వెంటనే స్పందించకుంటే దాన్ని బలహీనతగా నిస్సహాయతగా చూడవద్దని జస్టిస్ రమణ అన్నారు. జడ్జీలపై భౌతిక దాడులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్ రమణ.. న్యాయ వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.