కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థలు రాజ్యాంగ విశ్వాసానికి సమాన భాండాగారాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయాన్ని అందించే బాధ్యత కేవలం న్యాయస్థానాలదే అనే భావనను రాజ్యాంగం తొలగిస్తుందని అని ఆయన చెప్పారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో సుప్రీంకోర్టు ఆవరణలో ఆయన జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 38ను ఆయన ప్రస్తావించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను కాపాడుకోవడం ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు.
కరోనా మహమ్మారి వల్ల గత 16 నెలల్లో సుప్రీంకోర్టు కేవలం 55 రోజులు మాత్రమే భౌతిక విచారణలు జరిపిందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తన కుటుంబసభ్యులు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని అన్నారు. దురదృష్టవశాత్తు మళ్లీ ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
"కరోనా మహ్మమారి ధాటికి ఎక్కువ మంది సన్నిహితులు ప్రాణాలు కోల్పోయారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు, అధికారులు.. డాక్యుమెంట్లను ముట్టుకోవడానికి సైతం భయపడ్డారు. మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నాను. అప్పుడు కోర్టు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. రాజ్యాంగం రూపొందించడంలో అనేక మంది న్యాయవాదులు సహకారం అందించారు. భారతదేశానికి చెందిన చాలా మంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కీలక పదవుల్లో ఉన్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది."