పోలీసు కస్టడీలోని నిందితులు ఇప్పటికీ శారీరక హింసకు గురికావడం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ ఉన్న వ్యక్తులపై కూడా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు న్యాయస్థానాల దృష్టికి వచ్చిందన్నారు. పోలీస్ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘనపై దేశవ్యాప్తంగా పోలీసులకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ న్యాయసేవా కేంద్రం-నల్సా యాప్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. యాప్ ద్వారా ప్రజలకు న్యాయసేవ మరింత చేరువ కానుందని పేర్కొన్నారు.
అందరికీ చేరువలో న్యాయవ్యవస్థ..
చట్ట ప్రకారం నడుచుకునే సమాజంలో విశేషమైన రక్షణ ఉన్న వ్యక్తులకు న్యాయపరిజ్ఞానం లేని వ్యక్తులకు న్యాయం అందే విధానంలో ఉన్న తేడాను తొలగించడం అత్యావశ్యకమని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ పౌరుల విశ్వాసాన్ని చూరగొనడం అత్యవసరం అన్నారు. న్యాయ వ్యవస్థ వారికోసమే ఉందన్న విశ్వాసం కల్పించాలని చెప్పారు. న్యాయపరిజ్ఞానం లేని ఎంతో మంది ఏళ్లుగా న్యాయవ్యవస్థకు వెలుపలే ఉండిపోతున్నారని జస్టిస్ రమణ అన్నారు. గతం భవిష్యత్‌ను నిర్దేశించజాలదన్న ఆయన.. అందరూ కలిసి సమానత్వ సాధనకు కృషి చేయాలని న్యాయవ్యవస్థలో భాగస్వాములైన వారికి పిలుపునిచ్చారు. నల్సా యాప్ పేదలకు, న్యాయ సహాయం అవసరమైన వారికి పరిహారం కోసం బాధితులు చేసే పోరాటంలో అండగా ఉంటుందని జస్టిస్ రమణ చెప్పారు. ఈ కార్యక్రమంలో కస్టోడియల్ హింసపై జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో ఇప్పటికీ పోలీసుల దాష్టీకాలు కొనసాగుతుండడం ఆందోళనకరం. రాజ్యాంగపరంగా విశేషమైన రక్షణ ఉన్న వ్యక్తులపై కూడా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. మానవహక్కుల ఉల్లంఘన సహా.. శారీరక హింస పోలీస్ స్టేషన్లలోనే ఎక్కువగా ఉంటోంది. న్యాయవ్యవస్థ ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమను తాము న్యాయపరంగా రక్షించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి.
-జస్టిస్ ఎన్.వి. రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి