ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన అభియోగపత్రంలో పలు కీలక వివరాలను పొందుపర్చింది. తన కుమారుడు కార్తీ వ్యాపార ప్రయోజనాల కోసం సాయం చేయాల్సిందిగా ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లకు చిదంబరం సూచించారని పేర్కొంది. చిదంబరంపై ఈడీ అభియోగాల్లో ఇదే అత్యంత కీలకమైన అంశమని తెలిపింది.
కీలక ఆధారాలతో ఈడీ..
కార్తీ చిదంబరం తన అడ్వాంటేజ్ స్ట్రేటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్సీపీఎల్) సంస్థ కోసం సాయం చేయాల్సిందిగా తన తండ్రిని సంప్రదించినట్లుగా ఈడీ తెలిపింది. కార్తీ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలు, ఈమెయిల్స్ విశ్లేషణ ద్వారా ఈ విషయం వెల్లడైందని చెప్పింది. కార్తీ దగ్గర పనిచేసే అకౌంటెంట్ ఎస్.ఎస్ భాస్కరన్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు పేర్కొంది.