బాలీవుడ్లో సినిమా 'రన్'లోని ఓ సీన్లో తక్కువ ధరకు చికెన్ బిర్యానీ వచ్చిందని కొనుక్కుని తింటాడో వ్యక్తి. కానీ తరువాత ఆయనకు తెలుస్తుంది అది కాకి బిర్యానీ అని. ఇలాంటి తతంగమే నిజజీవితంలో జరుగుతోందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ముంబయిలో చికెన్ బిర్యానీ పేరుతో పావురం మాంసంతో బిర్యానీ చేసి అమ్ముతున్నారని ఓ విశ్రాంత సైనికాధికారి ఆరోపించారు. అందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కొన్ని ఫొటోలు సమర్పించారు.
'ఆ బార్ అండ్ రెస్టారెంట్లలో చికెన్‌కు బదులు పావురం బిర్యానీ.. ఇవిగో సాక్ష్యాలు!' - ముంబయి పావురం బిర్యానీ లేటెస్ట్ న్యూస్
ఓ వ్యక్తి పావురాలను పెంచి బార్ అండ్ రెస్టారెంట్లకు అమ్ముతున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆయా చోట్ల చికెన్‌కు బదులు పావురం మాంసంతో బిర్యానీ వండి వడ్డిస్తున్నారంటూ విశ్రాంత సైనికాధికారి ఒకరు ఆరోపించారు. ముంబయి పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
సియోన్ ఠాణా పరిధిలో అభిషేక్ సావంత్ పావురాలను పెంచి బార్, రెస్టారెంట్స్‌లో అమ్ముతున్నాడని రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ హరీశ్(71) పోలీసులకు ఫిర్యాదు చేశారు. "అభిషేక్ అనే వ్యక్తి అపార్ట్‌మెంట్‌పై పావురాలను పెంచుతున్నాడు. తన డ్రైవర్ సహాయంతో వాటిని ముంబయిలోని బార్, రెస్టారెంట్స్‌కు అమ్ముతున్నాడు. అపార్ట్మెంట్ సోసైటీ వాచ్‌మ్యాన్ ఆ పావురాలకు నీళ్లు పోసేందుకు వెళ్లేవాడు. ఈ విషయాన్ని అపార్ట్మెంట్ సొసైటీలో కొంతమందికి చెప్పాడు. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు" అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు హరీశ్.
హరీశ్ ఫిర్యాదుతో పోలీసులు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, సొసైటీలో కొంతమందిపై ఐపీసీ సెక్షన్ 34, 429, 447 కింద కేసులు పెట్టారు. అయితే ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. అసలు హరీశ్ చెప్పిన విషయాలు నిజమా కాదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.