Ram Naam Bank in Chhattisgarh :సాధారణంగా బ్యాంకుల్లో డబ్బులు జమచేయడం, రుణాలు ఇవ్వడం లాంటివి జరుగుతుంటాయి. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని ఓ బ్యాంక్ మాత్రం నగదు లావాదేవీలకు బదులుగా రామ నామాల కాపీలను స్వీకరిస్తోంది. సుమారు 700 మంది ఖాతాదారులతో నడిచే ఈ బ్యాంక్‌లో ఇప్పటివరకు వంద కోట్లకు పైగా రామనామాలు జమ అయ్యాయి.
'శ్రీ సీతారామ్ నామ్' పేరుతో ఈ బ్యాంకును 2018లో ప్రారంభించారు. ఇందులో ఖాతాను ప్రారంభించాలనుకునే రామ భక్తులు తొలుత తమ పేరును నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాంకు అధికారులు వారికి పది పేజీలు గల రామ నామాలు రాసే ఓ కాపీతో పాటు ఓ పెన్ను అందిస్తారు. వీటిని తీసుకున్న ఖాతాదారులు సీతారాముల నామాలను రాసి ఆ కాపీని బ్యాంక్‌లో జమ చేస్తుంటారు. వీటన్నింటిని బ్యాంక్ రికార్డుల్లోనూ భద్రపరుస్తారు. ఇక్కడ రామనామాల కాపీలను స్వీకరించడమే కాకుండా అక్కడికి వచ్చిన భక్తులకు ప్రసంశా పత్రాన్ని కూడా అందజేస్తుంటారు.
"భక్తులు ఇక్కడ కాపీలను తీసుకుని వెళ్లి రామనామాలు రాస్తారు. ఆ తర్వాత వాటిని తిరిగి జమ చేస్తారు. అనంతరం వారికి మరో కొత్త కాపీని అందజేస్తాము. ఈ బ్యాంక్‌ను 2018లో ప్రారంభించాము. ఈ 6-7 సంవత్సరాలలో రామనామాల సంఖ్య సుమారు 100 కోట్ల వరకు చేరుకుంది".
-- పురుషోత్తం ప్రసాద్ సోనీ, శ్రీ సీతారామ్ నామ్ బ్యాంక్ మేనేజర్