Chhattisgarh New CM Political Career :ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా గిరిజన నాయకుడు విష్ణుదేవ్ సాయ్ నియమితులయ్యారు. ఉత్తర్ ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురీ నియోజకవర్గం నుంచి గెలిచిన విష్ణుదేవ్ సాయ్‌ను కొత్త ఎన్నికైన 54మంది ఎమ్మెల్యేలు ఆదివారం తమ శాసనసభాపక్ష నేతగా ఎంచుకున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విష్ణుదేవ్ సాయ్‌ను గొప్ప వ్యక్తిని చేస్తానని కొన్నిరోజుల క్రితం కేంద్రమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అప్పుడు చెప్పినట్లే ఇప్పుడు రాష్ట్రానికి ఏకంగా ముఖ్యమంత్రిని చేశారు!
నవంబర్ నెలలో కుంకురీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఆ సమయంలో విష్ణుదేవ్ సాయ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే విష్ణుదేవ్ సాయ్‌ను 'గొప్ప వ్యక్తి'ని చేస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు సీఎంగా పనిచేసిన రమణ్ సింగ్‌ను కాదని బీజేపీ అధిష్ఠానం విష్ణుదేవ్ సాయ్‌వైపే మొగ్గు చూపడం గమనార్హం.
ఎవరీ విష్ణుదేవ్ సాయ్?
- 1964 ఫిబ్రవర్ 21వ తేదీన జన్మించిన విష్ణుదేవ్ సాయ్(59) గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
- రాష్ట్రంలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఎదిగి 2020 నుంచి 2022 వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విష్ణుదేవ్ వ్యవహరించారు.
- 1999, 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌గఢ్ నియోజకవర్గం నుంచి వరుసగా ఎన్నికయ్యారు.
- ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా సేవలందించారు.
- ఇటీవల జరిగిన ఎన్నికల్లో జాష్పుర్ జిల్లాలోని కుంకురీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే యుడి మింజ్‌పై 25,541 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- విష్ణుదేవ్ ఆదివాసీ వర్గానికి చెందిన వారు. రాష్ట్రంలో ఆదివాసీల సంఖ్య దాదాపు 30 శాతానికి పైగా ఉంటుంది. దీంతో బీజేపీ అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపింది.
- విష్ణు ప్రాతినిధ్యం వహిస్తున్న జాష్పుర్ జిల్లా ఝార్ఖండ్, ఒడిశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. దీంతో రానున్న ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోని ఆదివాసీల మన్ననలు, విశ్వాసాన్ని పొందేందుకే ఈయనను ఎంపిక చేసిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
- రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎంగా బాధ్యతలు నిర్వహించిన అజిత్ జోగి తొలి ఆదివాసీ సీఎం కాగా, సుదీర్ఘకాలం తరువాత మరో ఆదివాసీకి అవకాశం లభించింది.
- ఓబీసీ లేదా ఆదివాసీ వర్గానికి చెందిన ఎవరినీ సీఎంను నియమించాలన్న అంశంపై బీజేపీ సుదీర్ఘంగా చర్చించింది. అరుణ్‌సావో, ఓపీ చౌదరి బీసీ వర్గానికి చెందినవారు కాగా, విష్ణుదేవ్, రేణుకా సింగ్, రాంవిచార్ నేతమ్ తదితరులు ఆదివాసీ వర్గానికి చెందినవారు. పాత సీఎం రమణ్ సింగ్ పేరును పరిశీలించినా చివరకు విష్ణుసాయ్‌ను ఎంపిక చేశారు.
'మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు'
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విష్ణుదేవ్ సాయ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా ప్రధాని మోదీ హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. మరోవైపు, తన కుమారుడు దేశప్రజలకు సేవ చేయాలని తాను కోరుకుంటున్నట్లు విష్ణుదేవ్ తల్లి జస్మనీ దేవి తెలిపారు. చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు.