ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తి 21 ఏళ్లపాటు గడ్డం తీయలేదు. కొత్త జిల్లా ఏర్పడే వరకు గడ్డం తీయనని శపథం చేశాడు. కొరియా జిల్లా నుంచి వేరుచేసి మనేంద్రగఢ్-చిర్మిరి-భారత్‌పుర్(ఎంసీబీ)ను కొత్త జిల్లాగా ప్రకటించడం వల్ల రామశంకర్ గుప్తా అనే వ్యక్తి శుక్రవారం.. క్లీన్ షేవ్ చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎంసీబీను 32వ జిల్లాగా ఏర్పాటు చేసింది.
అసలేం జరిగిందంటే.. రామశంకర్ గుప్తా.. మనేంద్రగఢ్కు చెందిన వ్యక్తి. అతడు ఆర్టీఐ కార్యకర్త. మనేంద్రగఢ్-చిల్మరి-భరత్పుర్ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని గత 21 ఏళ్లుగా రామశంకర్ గడ్డం తీయలేదు. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం ఎంసీబీను కొత్త జిల్లాగా ప్రకటించింది. ఈ క్రమంలో రామశంకర్ తన గడ్డాన్ని తీశాడు. అయితే కొత్త జిల్లాగా అధికారికంగా ఏర్పాటయ్యేసరికి ఆలస్యమైంది. దీంతో మళ్లీ సంవత్సరం నుంచి గడ్డం పెంచాడు. తాజాగా రామశంకర్ కోరిక నెరవేరింది. దీంతో ఆయన శుక్రవారం తన గడ్డాన్ని క్లీన్ షేవ్ చేశాడు.
మనేంద్రగఢ్-చిర్మిరి-భారత్‌పుర్ జిల్లాగా ఏర్పాటయ్యే వరకు గడ్డం తీయనని శపథం చేశా. జిల్లాగా మారకపోతే గడ్డం తీయకపోయేవాడిని. కొత్త జిల్లా ఏర్పాటు కోసం 40 ఏళ్లు పోరాటం చేశాను. కొత్త జిల్లా ఏర్పాటు కోసం చాలా మంది పోరాడారు. వారిలో కొందరు మరణించారు. కొత్త జిల్లా ఏర్పాటుతో వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు కృతజ్ఞతలు. దేశంలోనే మోడల్ జిల్లాగా ఎంసీబీ జిల్లా మారుతుందని అశిస్తున్నా.