Chhattisgarh Election Results 2023 : ఎగ్జిట్ పోల్స్‌ను తారుమారు చేస్తూ సాగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఓ బీజేపీ అభ్యర్థి కేవలం 16 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ కేవలం 94 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈయనే కాకుండా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న అనేక మంది మంత్రులు సైతం ఓటమిని చవిచూశారు. 13 మందితో కూడిన మంత్రివర్గంలో 9 మంది పరాజయం పాలయ్యారు.
- కాంకేర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆశారామ్ నేతమ్ కేవలం 16 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆశారామ్‌కు 67,980 ఓట్లు రాగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ ధ్రువకు 67,964 ఓట్లు పడ్డాయి.
- ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ అంబికాపుర్ స్థానం నుంచి పోటీ చేసి 94 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సింగ్ దేవ్‌కు 90,686 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రాజేశ్ అగర్వాల్‌కు 90,780 ఓట్లు వచ్చాయి.
- పత్యాలంగావ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గోమతి సాయి 255 ఓట్లతో గెలుపొందారు. ఆమెకు 82,320 ఓట్లు రాగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి 82,065 ఓట్ల వచ్చాయి.
- పాలీ తానాఖార్ స్థానంలో తులేశ్వర్ సింగ్ మర్కామ్ 714 ఓట్లతో గెలుపొందారు. గోండ్వానా రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడైన ఈయన, ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడం విశేషం. ఈయన ఆ పార్టీ వ్యవస్థాపకులు హిరా సింగ్ మార్కామ్ కుమారుడు. ఈయనకు 60,862 ఓట్లు రాగా, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దులేశ్వరి సిదర్కు 60,148 ఓట్ల పడ్డాయి.
- బింద్రాన్వాగగఢ్ కాంగ్రెస్ అభ్యర్థి జనక్ ధ్రువ్ 816 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి గోవర్థన్ సింగ్ మాంఝీని ఓడించారు. ధ్రువ్‌కు 92,639 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 91,823 ఓట్లు వచ్చాయి.
- భిలాయ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ 1,264 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమ్ ప్రకాశ్ పాండేకు 53,141 రాగా, దేవేంద్రకు 54,405 ఓట్లు వచ్చాయి.