Chhattisgarh Election 2023 :నక్సల్ ప్రభావిత బస్తర్‌లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌కు గాయాలయ్యాయి. అదే జిల్లాలోని మిన్పాలో నక్సలైట్లు, భద్రత బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు సీఆర్‌పీఎఫ్ కమాండోలు తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు బాండా పోలింగ్ స్టేషన్ సమీపంలో నక్సలైట్లకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. నారాయణ్‌పుర్ జిల్లాలోని ఓర్చా పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో నక్సలైట్లు దాడులకు పాల్పడ్డారు.
Bastar Chhattisgarh Election : సమస్యాత్మక దంతెవాడ, బీజాపుర్, అంతగఢ్, భానుప్రతాపుర్, కంకేర్, కొండగావ్, కేష్‌కల్, నారాయణపుర్, కొంటా స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగింది. బస్తర్, జగదల్‌పుర్, చిత్రకోట్ సహా మిగిలిన స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ సాగింది. తొలి దశలో మొత్తంగా 71శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 20 స్థానాల్లో మొత్తం 223 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే, కొన్ని చోట్ల ప్రజలు ఓటు వేసేందుకు భయపడ్డారు. ఓటు వేసిన వేలును నరికేస్తామన్న మావోయిస్టుల బెదిరింపులతో ప్రజలు ఇంకు పెట్టుకునేందుకు వెనుకడుగేశారు. అధికారుల ప్రోత్సాహంతో వేలుకు ఇంకు లేకుండా ఓటు వేశారు.