ఛత్తీస్‌గఢ్‌లో నిరుపేద పిల్లలకు కబడ్డీలో శిక్షణనిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఓ జంట. ఆటపై మక్కువతో ఇలా మురికివాడల్లోని బాలబాలికలకు ఉచిత తర్ఫీదునిస్తూ.. జాతీయ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ శిక్షకుల వద్ద ఆట నేర్చుకున్న క్రీడాకారులెందరో రాష్ట్ర, జాతీయస్థాయి వేదికలపై తళుక్కుమంటున్నారు.
భిలాయ్‌కు చెందిన జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్ ఏ.ప్రకాశ్ రావు, బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ఏ.ఛాయ ప్రకాశ్ రావు దంపతులు.. స్లమ్ ప్రాంతాల్లోని పిల్లలను ఉత్తమ కబడ్డీ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను ఎన్నుకుని వారిలోని ప్రతిభను వెలికితీస్తున్నారీ శిక్షకులు. వారి ప్రతిభకు మరిన్ని మెళకువలు నేర్పి.. అత్యుత్తమ ఆటతీరును బయటకు తీస్తున్నారు.
ఇదీ చదవండి:ఔరా! ఈ దివ్యాంగుల చేతులు అద్భుతాల్ని చేశాయి
17 ఏళ్లుగా ..
ఇలా మురికివాడల్లోని మాణిక్యాలను వెలికితీయడమే లక్ష్యంగా.. 2004 నుంచే శిక్షణ శిబరం ఆరంభించారీ దంపతులు. 2004 నుంచి 2009 వరకు భిలాయ్‌లోని సెక్టార్-1లో ఆరేళ్లపాటు ఎంతో మందికి శిక్షణనిచ్చారు. 2009-2019 మధ్య కాలంలో ఖుర్సీపార్ జోన్-2 పాఠశాలలో మరికొందరిని తీర్చిదిద్దారు. 2019 నుంచి ఖుర్సిపార్లోని బాల్ మందిర్ మైదానంలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇలా 17 ఏళ్లలో 300 మందికిపైగా ఆటగాళ్లు శిక్షణపొంది.. జాతీయస్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించారు.
కోచ్‌లుగా ప్రకాశ్ రావు దంపతుల ఘనతలు..
- 2018లో ఆరుగురు ఆటగాళ్లు ఖేలో ఇండియాకు ఎంపిక.
- 2019లో మరో 8 మంది ఖేలో ఇండియాకు ఎంపిక.
- ముగ్గురు ప్లేయర్లకు 'షాహీద్ పంకజ్ విక్రమ్' అవార్డులు.
- ఐదుగురు క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపిక.
- మరో 25 మంది.. పోలీస్ శాఖ, ఇతర విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు.
ఇలా తమ కింద శిక్షణ పొందిన వారెందరో ఉన్నత స్థాయికి చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రకాశ్ రావు దంపతులు. రానున్న కాలంలో మరికొందరు పేద పిల్లల్ని తీర్చిదిద్దేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు.
"నేను తొలుత బాస్కెట్‌బాల్ ప్లేయర్‌ను. మా కోచ్ రాజేశ్ పటేల్(లేట్) ఎంతోమందిని ఉత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దారు. నేను మంచి కోచ్ అవుతానని ఆయనెప్పుడూ అంటుండేవారు. ఇదే విషయం నా భర్తతోనూ చెప్పారు. ఆ స్ఫూర్తితోనే మేం పేద పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు పూనుకున్నాం. 2004లో మొదలైన మా శిక్షణా ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. ధనవంతులైన పిల్లలు వారి స్థాయికి తగినట్టు పరికరాలు కొని, సాధన చేస్తారు. అయితే.. వీరికి ఆ అవకాశముండదు. దేవుడు మనకిచ్చిన దాంట్లో.. కాస్తంత వీరికి తోడ్పాటునందిస్తే.. వీరు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారనేదే మా ఉద్దేశం."