Chhattisgarh CM Swearing In Ceremony :ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పుర్‌లోని సైన్స్ కళాశాల మైదానంలో బుధవారం మధ్యాహ్నం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంతి యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రులు భూపేశ్ బఘేల్, రమణ్‌సింగ్ హాజరయ్యారు.
అనూహ్యంగా రేసులోకి వచ్చిన విష్ణుదేవ్ సాయ్
అంతకుముందు ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో విష్ణుదేవ్ సాయ్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. గతంలో ఛత్తీస్‌గఢ్ సీఎంగా పనిచేసిన రమణ్ సింగ్‌ను కాదని ఈసారి బీజేపీ అధిష్ఠానం గిరిజన నాయకుడైన విష్ణుదేవ్ సాయ్‌వైపు మొగ్గు చూపింది.
ఎవరీ విష్ణుదేవ్ సాయ్?
1964 ఫిబ్రవర్ 21వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన కుటుంబంలో జన్మించిన విష్ణుదేవ్ సాయ్కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. నాలుగు సార్లు ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. జష్‌పుర్ జిల్లాలోని కుంకురీ నుంచి తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం సర్గుజా డివిజన్‌లోని మొత్తం 14 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, అందులో సాయ్ పాత్ర చాలా కీలకం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీజేపీ ఎన్నడూ గెలవని అనేక స్థానాల్లో కూడా సాయ్ వ్యూహంతో బీజేపీ గెలిచింది.