నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగులకు భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బస్తర్ జిల్లాలోని జగదల్‌పుర్‌లోని లాల్‌బాగ్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు బఘేల్. ఆ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
ఈ ఏడాది డిసెంబరులో ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి ఒకటి. ఇప్పుడు ఈ హామీ అమలుపై ప్రకటన చేశారు సీఎం. నిరుద్యోగ భృతితోపాటు ఎన్నికలకు ముందు వేర్వేరు వర్గాల్ని ఆకట్టుకునేలా మరికొన్ని వరాలు ప్రకటించారు భూపేశ్ బఘేల్.
'రాయ్‌పుర్ విమానాశ్రయం సమీపంలో ఏరో సిటీని ఏర్పాటు చేస్తాం. ఛత్తీస్‌గఢ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో మూడేళ్ల పాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.50 వేలు సాయం చేస్తాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆదాయాన్ని పెంచేందుకు.. గ్రామీణ పరిశ్రమల విధానాన్ని రూపొందిస్తున్నాం. మహిళా సంఘాలు, మహిళా వ్యాపారవేత్తలు స్టార్టప్‌లు ప్రారంభించేందుకు ప్రోత్సహిస్తాం. అందుకోసం కొత్త పథకాన్ని తీసుకొస్తాం. గిరిజన సంస్కృతిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గిరిజన ప్రాంతాల్లో పండగల నిర్వహణకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 వేలు సాయం చేస్తాం. మాతా కౌశల్య ఆలయం ఉన్న చంద్‌ఖూరిలో ప్రతి సంవత్సరం మా కౌశలయ మహోత్సవాన్ని నిర్వహిస్తాం.
--భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి