Chhattisgarh Assembly Election Results 2023 :ఛత్తీస్‌గఢ్‌లో భారతీయ జనతా పార్టీ- బీజేపీ మేజిక్ చేసింది. 15 ఏళ్ల కంచుకోటను కాంగ్రెస్ నుంచి తిరిగి సొంతం చేసుకుంది. 2018 ఎన్నికల్లో 90 సీట్లలో కేవలం 15 స్థానాలకు మాత్రమే పరిమితమై అధికారం కోల్పోయిన కాషాయ దళం.. ఐదేళ్లలో అసాధారణ రీతిలో పుంజుకుని మేజిక్ ఫిగర్‌ను దాటింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన తప్పులను ఎండగట్టి విజయం సాధించింది. బీజేపీ 54 స్థానాలను కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ 35 చోట్ల గెలుపొందింది. మరోచోట ఇతరలు విజయం సాధించారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు 2023 ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు 2023 ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు 2018 కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు బీజేపీ నాయకులు. దీంతో 2018లో కోల్పోయిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకున్నారు. రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లి ప్రతిపక్ష స్థానానికే పరిమితం చేశారు.
తిరిగి కోల్పోయిన అధికారాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనిబీజేపీ కసితో పావులు కదిపింది. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీఎం భూపేశ్ భఘేల్ను ఢీకొట్టే నేత లేక బీజేపీలో లేక అనిశ్చితి నెలకొంది. దీంతో బీజేపీ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారు అనుకున్నట్లే బీజేపీ మేజిక్ చేసింది.అవినీతి ఆరోపణలు, మత మార్పిడులు, హామీలు నెరవేర్చకపోవడం వంటి అస్త్రాలను సంధించి కాంగ్రెస్‌ను గద్దె దించింది. అయితే 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 50 సీట్లకు మించని బీజేపీ తాజాగా ఆ రికార్డులన్నింటినీ బద్దలుగొడుతూ 54 స్థానాల్లో విజయం సాధించింది.
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో గెలుపును శాసించిన అంశాలు ఇవే: మోదీ కరిష్మా..
2018లో ఓటమి తర్వాత బీజేపీ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఛత్తీస్‌గఢ్ పార్టీ విభాగం అధ్యక్షుడిని మూడుసార్లు మార్చింది. అసెంబ్లీలో విపక్ష నేతను కూడా ఇటీవల మార్చింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను సైతం పక్కన పెట్టింది. పార్టీని నడిపించే బలమైన నాయకుడు లేకపోవడం లోటే అయినా ఏకపక్ష నాయకత్వం, కుటుంబ రాజకీయాలు ఉండరాదని ప్రధాని నరేంద్ర మోదీ భావించారు. అందుకే మోదీ కరిష్మాతోనే ఛత్తీస్‌గఢ్‌లోనూ పోరాడాలని బీజేపీ నిర్ణయించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో కమలదళం ప్రజల్లోకి వెళ్లింది. ఇందులో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పూర్తిగా భిన్నంగా అధికారం తిరిగి సంపాదించింది.
40 మంది స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం..
అధికారమే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా సుడిగాలి పర్యటనలు చేశారు. కేంద్ర మంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రెండు విడతల్లో జరిగిన పోలింగ్ కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది కమలదళం. అభ్యర్థుల్లో ప్రముఖ నటులు, మాజీ ఐఏఎస్ అధికారులకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగు మలచుకోవడంలో సఫలమైంది.
కాంగ్రెస్‌పై ఆరోపణలు..
బొగ్గు గునులు, ఆవు పేడ సేకరణ పథకం, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వ్యవహారాల్లో అవినీతికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటికి సంబంధించిన కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా వంటి బీజేపీ అగ్రనేతలు వీటిని విమర్శనాస్త్రాలుగా ఎక్కుపెట్టిభగేల్ సర్కార్‌ను దోషిగా చూపే ప్రయత్నం చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందనే ఆరోపణలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది బీజేపీ. గత రెండేళ్లలో గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలు, ముఖ్యంగా బస్తర్ డివిజన్ నుంచి మత మార్పిడిపై అనేక గొడవలు జరిగాయి. క్రైస్తవ మతంలోకి మారిన గిరిజనులు, మారని వారి మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. అయితే మత మార్పిడులకు పాల్పడిన వారిని ప్రభుత్వం కాపాడుతోందని బీజేపీ ఆరోపించింది. దీంతో కాంగ్రెస్‌పై వచ్చిన వ్యతిరేకతను క్యాష్ చేసుకుంది కాషాయ దళం.
అన్ని వర్గాలను ఆకట్టుకునేలా హామీలు..
యువతను ఆకట్టుకునేలా 'మోదీ గ్యారంటీ' పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు ఇలా అన్ని రంగాల వారికీ లబ్ధి చేకూరేలా హామీలు గుప్పించింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలోకి రావడంలో అవి కీలక పాత్ర పోషించాయి. వాటిలోని కీలక హామీలు..
- రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ.
- పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్.
- కాలేజీ విద్యార్థులు ప్రతినెలా ప్రయాణ భత్యం.
- రెండేళ్లలో ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద 18 లక్షల ఇళ్ల నిర్మాణం. ఘర్ ఘర్ నిర్మల్ జల్ పథకం కింద నల్లా కనెక్షన్.
- దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి మజ్దూర్ పథకం కింద భూమి లేని వ్యవసాయ రైతులకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం.
- మతారి వందన్ పథకం కింద పెళ్లైన మహిళలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం.
- కృషి ఉన్నతి పథకం కింద రైతుల నుంచి ఎకరానికి 21 క్వింటాళ్ల చొప్పున రూ.3,100 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు.
- రాష్ట్ర ప్రజలకు ఉచిత అయోధ్య రామమందిర దర్శనం.
మౌలిక సదుపాయాలు..
గత ఐదేళ్లలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆగిపోయిందని, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లి మద్దతు కూడగట్టింది.
కాంగ్రెస్ హామీలు నెరవేర్చక పోవడం..
2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నరెవేర్చలేదని బీజేపీ ప్రచారం చేసింది. మద్యాన్ని నిషేధిస్తామనే కీలక ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చని భగేల్ ప్రభుత్వాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. దీంతోపాటు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీ కూడా నెరవేర్చలేదు. దీన్ని కూడా బీజేపీ అస్త్రంగా మార్చుకుని సానుకూలత కూడగట్టింది.
రాజస్థాన్‌లో బీజేపీ హవా- వసుంధర, గహ్లోత్ లీడింగ్- పుంజుకున్న పైలట్
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ మేజిక్- కాంగ్రెస్‌కు బిగ్ షాక్! ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు!!