తెలంగాణ

telangana

ETV Bharat / bharat

15 మంది జవాన్లు మిస్సింగ్​- అమిత్​ షా ఆరా - ఛత్తీస్​గఢ్​ ఎన్​కౌంటర్​ తాజా వార్తలు

ఛత్తీస్‌గఢ్​ బీజాపుర్ జిల్లా అడవుల్లో నక్సల్స్​కు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్​ తర్వాత... 15 మంది భద్రతా సిబ్బంది అదృశ్యమయ్యారని తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులు కాగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు చెప్పారు. అమరుల కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సంతాపం తెలిపారు. ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రితో మాట్లాడి ఎన్​కౌంటర్​ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Bijapur Naxal encounter
బీజాపుర్ ఎన్​కౌంటర్​: 15 మంది జవాన్లు అదృశ్యం!

By

Published : Apr 4, 2021, 9:22 AM IST

Updated : Apr 4, 2021, 11:14 AM IST

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​ జిల్లాలో శనివారం నక్సల్స్​కు, జవాన్లకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్ అనంతరం ​ 15 మంది భద్రతా సిబ్బంది అదృశ్యమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయని ఛత్తీస్​గఢ్​ పోలీసు వర్గాలు తెలిపాయి. 23 మంది గాయపడగా.. బీజాపుర్​ ఆసుపత్రికి తరలించామని, మరో ఏడుగుర్ని రాయ్​పుర్​ ఆసుపత్రికి తరలించామని చెప్పాయి.

బీజాపుర్​లోని తారెం ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, మరో 10 మందికి గాయాలయ్యాయని ఛత్తీస్‌గఢ్​ డీజీపీ అవస్థీ తెలిపారు. నక్సల్ ఏరివేతలో భాగంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారని.. దీంతో భద్రతా దళాలు దాడి చేశాయని చెప్పారు.

9 మంది నక్సల్స్ హతం!

ప్రాథమిక సమాచారం ప్రకారం.. తొమ్మిది మంది నక్సల్స్ మరణించి ఉంటారని బస్తర్ ఐజీ పీ సుందర్​ రాజ్ వెల్లడించారు. మరో 15 మంది గాయపడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు మరింత సమయం కావాలని చెప్పారు. తమ అంచనా ప్రకారం ఘటన జరిగిన ప్రాంతంలో 250 మంది నక్సల్స్ ఉన్నారన్నారు.

అమిత్​ షా సంతాపం

బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో అమరులైన భద్రతా సిబ్బంది కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సంతాపం తెలిపారు. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. శాంతి వ్యతిరేకులపై తమ పోరాటం కొనసాగుతుందని ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేశారు.

ఈ ఘటనపై ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​తో అమిత్ షా మాట్లాడారు. ఎన్​కౌంటర్​ వివరాలు ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. సీఆర్​పీఎఫ్​ డైరెక్టర్​ జనరల్​ కుల్దీప్​ సింగ్​ను పరిస్థితిని సమీక్షించాలని షా ఆదేశించారు. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:శిక్షపడిన 25ఏళ్లకు పోలీసులకు చిక్కిన నేరస్థుడు

Last Updated : Apr 4, 2021, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details