Chhatrapati Shivaji Heir Demise : ఛత్రపతి శివాజీ మహారాజు 12వ తరం వారసుడైన ఛత్రపతి శివాజీరాజే భోసలే మంగళవారం పుణెలో తుది శ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యల వల్ల ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
శివాజీరాజే మృతిపై ఆయన మేనల్లుడు, భాజపా రాజ్యసభ ఎంపీ ఉదయ్‌రాజ్ భోసలే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మరణ వార్తను ట్విట్టర్ ద్వారా తెలిపారు. "శ్రీమంత్ ఛత్రపతి శివాజీరాజే భోసలే, ఛత్రపతి వారసుడు, సతారా మాజీ మేయర్ 75 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని సతారాలోని అధాలత్ వాడాలో అంతిమ దర్శనం కోసం బుధవారం ఉంచనున్నాం. గౌరవనీయులైన మామయ్యకు హృదయపూర్వక నివాళి" అని ట్వీట్ చేశారు.
మోదీ సంతాపం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్రపతి శివాజీరాజే భోసలే మృతికి సంతాపం తెలిపారు. సమాజం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. "ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిత్వం ఛత్రపతి శివాజీరాజే భోసలేది. సతారా పురోగతికి గొప్పగా కృషి చేశారు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అని మోదీ ట్వీట్ చేశారు.