తమిళనాడుకు చెందిన ఓ మహిళ.. తన కుమార్తెను మంచి యూనివర్సిటీలో చదివిద్దామని నిర్ణయించుకుంది. అందుకోసం ఎందరినో సంప్రదించింది. ఆ క్రమంలో తనకు పరిచయమైన కొందరి మోసగాళ్ల ఉచ్చులో పడిపోయింది. అమెరికాలో ఉత్తమ యూనివర్సిటీ ఉందని చెప్పిన వారు.. రూ.18 లక్షల ఫీజు కట్టించుకున్నారు. ఏడాది పాటు మహిళ కుమార్తెకు ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పారు. తీరా ఆ విద్యార్థిని.. అమెరికా వెళ్లాక చూస్తే అక్కడ ఎలాంటి యూనివర్సిటీ లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన విద్యార్థిని తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులకు విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. చెన్నైకు చెందిన రీదమీనా అనే విద్యార్థిని మెడిసిన్ చదవాలనుకుంటున్నట్లు తన తల్లి దియా శుభప్రియకు చెప్పింది. దీంతో దియా సుప్రియ.. విదేశాల్లో ఉన్న ఉత్తమ యూనివర్సిటీ కోసం వెతికింది. ఈ క్రమంలో ఇంటర్నెట్లో పలు యూనివర్సిటీల గురించి తెలుసుకుంది. ఆ సమయంలో ప్రవీణ్, సతీశ్ అనే ఇద్దరు వ్యక్తులు.. బాధితురాలిని సంతన్రాజ్, గోకుల్ అనే నిందితులకు పరిచయం చేశారు. విదేశీ వైద్య విద్యకు సంబధించిన విషయాల్లో సంతన్, గోకుల్ బాగా సహాయం చేస్తారని ప్రవీణ్, సతీశ్.. దియాకు తెలిపారు. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య విద్య అందించే యూనివర్సిటీలో సీటు ఇస్తామని హామీ ఇచ్చారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు అనుబంధంగా ఉన్న కరేబియన్ ద్వీపంలో ఉన్న సెయింట్ థెరిసా విశ్వవిద్యాలయం గురించి దియా శుభప్రియకు వారు తెలియజేశారు. ఆ తర్వాత 25 వేల డాలర్లను (18 లక్షల రూపాయలు) మెడికల్ ట్యూషన్ ఫీజుగా దియా చెల్లించారు. సంతనరాజ్, గోకుల్ 2022 విద్యా సంవత్సరానికి రీదమీనాకు యూనివర్శిటీ ప్రవేశానికి సంబంధించిన పత్రాలను అందించారు. కరోనా మహమ్మారి కారణంగా మెడిసన్ తొలి సంవత్సరం కోర్సులు.. ఆన్లైన్లోనే జరిగాయి.
దియా శుభప్రియ చేసిన ఫిర్యాదు అయితే రీతమీనా.. తన రెండో సంవత్సరం చదువు కోసం అమెరికా వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక సెయింట్ థెరిసా విశ్వవిద్యాలయం అసలు లేదని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. విశ్వవిద్యాలయం పేరుతో ఉన్న చిన్న భవనం మాత్రమే అక్కడ ఉంది. దీంతో ఆమె మోసపోయానని గుర్తించింది. ఆమెతోపాటు తమిళనాడుకు చెందిన 40 మందికి పైగా విద్యార్థులు ఈ బలయ్యారని తెలిసింది. తనలా ఇంకెవ్వరూ మోసపోకూడదని దియా సుప్రియ.. తాంబరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు చేసింది.
నకిలీ యూనివర్సటీ వివరాలు! ఆ తర్వాత దియా శుభప్రియ.. మీడియాతో మాట్లాడింది. మరి మీ డబ్బు పరిస్థితేంటి? అని విలేకరులు ఆమెను ప్రశించారు. "మోసపోయిన డబ్బును తిరిగి ఇవ్వమని వారికి అడిగితే.. వారు మళ్లీ కొత్త విద్యార్థుల నుంచి డబ్బు తీసుకొని ఇస్తామని చెప్పారు" అని పేర్కొంది. ఈ బోగస్ యూనివర్సిటీకి చెందిన ఇండియన్ అడ్మిషన్ ఆఫీస్ కానత్తూరులోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ఉందని ఆమె వెల్లడించారు. ఈ ఘటనతో విదేశాల్లో విద్యావకాశాల గురించి ఎదురుచూసే విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు! ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి మోసపూరిత చర్యకు బాధ్యులైన వారు తగిన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొనేలా చూడాలని విద్యార్థులు కోరారు.
నకిలీ యూనివర్సటీ ఫీజుల వివరాలు!