ప్రతి దుకాణానికి వెళ్లి యాచించడమే వారి వృత్తి అనుకునేవారికి సరైన జవాబు ఇస్తున్నారు చెన్నైకి చెందిన ట్రాన్స్జెండర్లు. ఒకరి వద్ద పనిచేయడమే కాదు... సొంతంగా నలుగురికి పని ఇవ్వగలమని నమ్మి.. 'చెన్నై ట్రాన్స్ కిచెన్' అనే హోటల్‌ను ఏర్పాటు చేశారు. యునైటెడ్ వే చెన్నై అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో.. ట్రాన్స్‌పర్సన్స్ రైట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ అయిన జీవా ఈ హోటల్‌ను ఏర్పాటు చేశారు. చెన్నై... కోలాతూర్లోని జీకేఎం కాలనీ, 25వ వీధిలో ఈ హోటల్ ఉంది. ఉదయం టిఫిన్లతో పాటు, మధ్యాహ్నం, సాయంత్రం వెజ్, నాన్‌వెజ్ వంటకాలను సర్వ్ చేస్తున్నారు. చేపల కూర, ఇడ్లీ కలిపి ఇచ్చే మీన్ కులంబు వంటకం ఇక్కడ ఫేమస్.
మొత్తం పది మంది ట్రాన్స్జెండర్లను హోటల్లో పనిచేసేందుకు నియమించుకున్నారు. ట్రాన్స్జెండర్లను బయట ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోవడం లేదని.. అందుకే సొంతంగా హోటల్ ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్ కిచెన్ యజమాని జీవా చెబుతున్నారు. ట్రాన్స్‌జెండర్లలో కొంతమందికైనా సొంత కాళ్లపై నిలబడే అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో ఈ హోటల్‌ను పెట్టినట్లు జీవా చెప్పారు.
"ఇదివరకు ట్రాన్స్‌జెండర్ తమ కుటుంబంలో ఉన్నారని తెలిస్తే వారిని బయటకు పంపించేవారు. వీరికి సరైన విద్య అందదు. ఉద్యోగ అవకాశాలు అసాధ్యం. ఒకవేళ చదువుకున్నవారు ఉన్నప్పటికీ వారిని ఉద్యోగాల్లో చేర్చుకునేవారు ఉండరు. కానీ పరిస్థితులు మారుతున్నాయి. కోయంబత్తూర్, మధురైలలో ఇప్పటికే ట్రాన్స్ కిచెన్లను ఏర్పాటు చేశాం. ట్రాన్స్జెండర్లంటే సెక్స్ వర్క్ మాత్రమే కాదని చెప్పేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ట్రాన్స్‌జెండర్లలో వంట బాగా చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. తొలుత 60 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చాం. అందులో 20 మందిని షార్ట్ లిస్ట్ చేసి.. చివరకు 10 మందిని నియమించుకున్నాం. ఇందులో ఐదుగురు ట్రాన్స్మెన్, ఐదుగురు ట్రాన్స్ఉమన్ ఉన్నారు. సైదాపేట్‌లో వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం."
-జీవా, ట్రాన్స్ ఉమన్