Chennai robbery case : చెన్నైలో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలోకి ఏడుగురు దుండగులు చొరబడి ఏకంగా రూ.30లక్షలు దోచుకెళ్లారు. పారిపోతున్న దొంగలను పట్టుకునేందుకు ఆ సంస్థ యజమాని, ఉద్యోగులు చేసిన ప్రయత్నం.. సినిమాను తలపించింది. చివరకు ఛేజింగ్ జరుగుతుండగా బైక్కు ప్రమాదం జరిగి ఒక దుండగుడు పట్టుబడ్డాడు. మిగిలిన వారు పారిపోయారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది.
కత్తులతో బీభత్సం సృష్టిస్తూ.. తమిళనాడులోని కిల్పక్కానికి చెందిన కరుణానిధి, కరూర్ జిల్లాకు చెందిన వెంకటేశన్, శరవణన్ కలిసి ఓజోన్ కేపిటల్ పేరిట ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారు. చెన్నై వడపళనిలో ఆ సంస్థ కార్యాలయంలోకి మంగళవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు చొరబడ్డారు. లోపల ఉన్న వారందరినీ కత్తులతో బెదిరించారు. లాకర్లో ఉన్న రూ.30లక్షలు లాక్కున్నారు. ఏం జరుగుతుందో ఆలస్యంగా తెలుసుకున్న యజమాని శరవణన్.. దుండగులు లోపల ఉండగానే ఆఫీసుకు తాళం వేశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు.