Chennai man kills wife children: తమిళనాడులో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఓ వ్యక్తితో పాటు అతడి భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలను చెన్నై సబర్బన్ పొలిచలూరులోని ఓ ఇంట్లో పోలీసులు శనివారం ఉదయం గుర్తించారు. ఇంటి యజమాని ప్రకాశ్(41) తొలుత తన భార్య గాయత్రితో పాటు పిల్లలను చంపి ఆపై తానూ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కలపను కోసే యంత్రంతో వీరిని చంపేశాడని తెలుస్తోంది. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థికపరమైన ఒత్తిళ్ల కారణంగానే అతడు ముందుగా ముగ్గురిని చంపేసి.. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Delhi man shot dead: ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరుగుతుండగా.. మధ్యలో కలగజేసుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. దిల్లీలోని అంబేడ్కర్ నగర్లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. డ్రింక్స్ విషయమై నయీమ్, గోపాల్ అనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో రోహిత్ (27) గొడవలో కలగజేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రోహిత్ అన్నయ్య గుల్షన్ (30) సైతం ఘటనాస్థలికి వెళ్లాడు. అప్పుడే సుమిత్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో రోహిత్, గుల్షన్ గాయపడ్డారు. వీరిద్దరినీ ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా.. గుల్షన్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రోహిత్‌కు చికిత్స కొనసాగుతోంది. నిందితుడు సుమిత్‌పై (24) ఇప్పటికే రెండు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గోపాల్, సాహిల్ అనే మరో ఇద్దరికి సైతం ప్రమేయం ఉందని చెప్పారు.
West Bengal father killed son: బంగాల్లో కన్నకొడుకునే హత్య చేశాడు ఓ వ్యక్తి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఆరేళ్ల తమ కుమారుడు కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు శనివారం ఉదయం నుంచి వెతకడం ప్రారంభించారు. ఓ నీటి కుంట వద్ద అతడి శవాన్ని గుర్తించారు. కుమారుడిని వెతకడంలో నిర్లక్ష్యం వహించిన తండ్రి.. కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. అనంతరం కొద్దిసేపటికి అతడు పారిపోయాడు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. పోలీసులు రంగంలోకి దిగి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడికి తన భార్యతో వైవాహిక సంబంధాలు సరిగా లేవని, కుమారుడితో కలిసి వేరే చోట నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.