Chennai Floods Update : మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వర్షం తగ్గినా ఇంకా చాలా చోట్ల వరద ప్రభావం కొనసాగుతోంది. చెన్నై గుబేరన్ నగర్‌లోని మడిపాక్కం ప్రాంతంలో చాలా వరకు ఇళ్లు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. అందుకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్నారు.
నగరంలోని పల్లికరణై ప్రాంతం చెరువును తలపిస్తోంది. అక్కడ ఇళ్లు, పలు పెట్రోల్ పంపులు వరదలో చిక్కుకుని ఉన్నాయి. చెన్నైలోని జెరూసలేం ఇంజినీరింగ్ కళాశాల జల దిగ్బంధంలోనే ఉంది. ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలో వరద ప్రభావం కాసింత ఎక్కువగానే ఉంది. అక్కడి ప్రజలకు తాగునీరు, 12వేల లీటర్ల పాలు, పాల పొడి, దుప్పట్లు, ఆహారం అందించినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన అనకపుత్తూర్‌ను సీఎం ఎంకే స్టాలిన్ సందర్శించారు. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించారు.
ఏరియల్ సర్వే నిర్వహించిన రాజ్‌నాథ్ సింగ్
మరోవైపు, కేంద్ర రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ చెన్నైలోని వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో మిగ్‌జాం తుపాను వల్ల సంభవించిన నష్టం, కేంద్రం నుంచి అవసరమైన సాయం గురించి రాజ్‌నాథ్‌కు స్టాలిన్ వివరించారు.