తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గంజాయిని ఎలుకలు తిన్నాయి'.. పోలీసుల వింత సమాధానంతో నిందితుల విడుదల

నేరస్ధులకు శిక్షలు పడటానికి బలమైన ఆధారాలు అవసరం. వాటి కోసం పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ చెన్నై డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పోలీసులు విచిత్రంగా ప్రవర్తించారు. ఆధారాల గురించి అడగగా వారు చెప్పిన వింత సమాధానాలు.. నిందితులను నిర్దోషులుగా వదిలేసింది.

Etv Chennai court acquits accused after police said rats eat up seized ganja
గంజాయి

By

Published : Jan 9, 2023, 8:40 PM IST

తమిళనాడు చెన్నైలోని కోయంబెడులో వింత ఘటన జరిగింది. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పోలీసులు విచిత్రంగా ప్రవర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని అడగగా.. ఎలుకలు తిన్నాయంటూ విచిత్ర సమాధానం చెప్పారు. దీంతో సరైన ఆధారాలు లేవనే కారణంతో నిందితులను నిర్దోషులగా ప్రకటించింది కోర్టు.

అసలేం జరిగిందంటే
2018లో చెన్నై కోయంబెడు బస్ స్టేషనులో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్నసేలంకి చెందిన కల్పన,విశాఖపట్నంకి చెందిన కుమారి, నాగమణిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 30కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే శనివారం స్వాధీనం చేసుకున్న గంజాయిని స్పెషల్ కోర్టుకు సమర్పించారు. గంజాయి బరువులో తేడా ఉందని న్యాయమూర్తి గమనించారు. ఎఫ్​ఐఆర్​లో 30కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు నమోదు చేయగా.. 19 కేజీలు మాత్రమే సమర్పించారు. దీనిపై సంబంధిత పోలీసు అధికారిని ప్రశ్నించగా .. గంజాయిని పోలీస్ స్టేషనులో ఉంచామని.. వర్షాల వల్ల గంజాయి పెట్టిన గది పాడయిపోయిందని చెప్పారు. అక్కడ ఎలుకలు కూడా ఎక్కువగా ఉన్నాయని.. అవే గంజాయిని తిన్నాయని.. అందుకే వాటి పరిమాణం తగ్గిందని పోలీసు అధికారి విచిత్ర సమాధానం చెప్పాడు. దీంతో ముగ్గురు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను అందించడంలో పోలీసులు విఫలమయ్యారని.. అరెస్టు చేసిన వారిని నిర్దోషులుగా విడుదల చేయాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

ఇలాంటి ఘటనే 2018లో ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది. మధుర పోలీసులు 60 లక్షల విలువ గల 581కేజీల గంజాయిని స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయిని షేర్కార్​ హైవే పోలీసు స్టేషనులో భద్రపరిచారు. కోర్టు విచారణ సమయంలో మధుర పోలీసులు గంజాయిని కోర్టులో సమర్పించలేదు. న్యాయమూర్తి ప్రశ్నించగా.. 581 కేజీల గంజాయిని ఎలుకలు తిన్నాయని చెప్పారు. దీనితో అరెస్టు చేసిన వారిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

ABOUT THE AUTHOR

...view details