చెన్నైలో బిర్యానీ ఏటీఎం వెలిసింది. ఆహార ప్రియులకు వేడివేడి బిర్యానీని అందిస్తోంది. చెన్నైకి చెందిన 'బీవీకే (బాయ్ వీటు కల్యాణం) బిర్యానీ' అనే స్టార్టప్ ఈ ఆటోమేటెడ్ బిర్యానీ మెషీన్‌ను నెలకొల్పింది. కొలత్తూర్ ప్రాంతంలో ఈ బిర్యానీ ఏటీఎంను ఏర్పాటు చేసింది. వివాహాల్లో అందించే రుచికరమైన ప్రీమియం బిర్యానీని ఈ ఏటీఎం ద్వారా సప్లై చేస్తున్నట్లు బీవీకే స్టార్టప్ చెబుతోంది. ఫామ్ నుంచి నేరుగా తీసుకొచ్చిన మాంసంతో ఈ బిర్యానీలను సిద్ధం చేసి సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. చికెన్, మటన్, బీఫ్ వంటి వెరైటీ బిర్యానీలను ఈ ఏటీఎం ద్వారా అందిస్తున్నారు.
సాధారణంగా బిర్యానీ అంటేనే లొట్టలు వేసుకునే ఆహార ప్రియులు.. కొత్తగా ఏటీఎం పెట్టారని తెలుసుకొని కోలత్తూర్కు పోటెత్తారు. స్థానికులంతా.. ఆ బిర్యానీ ఏటీఎంను ట్రై చేసేందుకు ఎగబడుతున్నారు. ఇందుకు సంబంధించి పలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. ఓ వ్యక్తి బిర్యానీ ఏటీఎం దగ్గరికి వెళ్తాడు. ఏటీఎం స్క్రీన్‌పై.. ఏఏ బిర్యానీ అందుబాటులో ఉందనే వివరాలు ఉంటాయి. మెనూలో నుంచి నచ్చిన బిర్యానీని ఆ వ్యక్తి ఎంపిక చేసుకుంటాడు. డబ్బులు చెల్లించగానే కాసేపు వేచి ఉండాలని ఏటీఎంపై డిస్ప్లే అవుతుంది. నిమిషాల వ్యవధిలోనే ఏటీఎం యంత్రంలో నుంచి బిర్యానీ బాక్స్ బయటకు వస్తుంది.