Cheetah In Kuno National Park : నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని శ్యోపుర్ జిల్లా కునో జాతీయ పార్కుకు ఇటీవల తరలించిన 8 చీతాలు కొత్త వాతావరణానికి ఎలా అలవాటు పడుతున్నాయన్నది నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మనుషులతో వాటికి ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా ఎన్‌క్లోజర్లకు 50 నుంచి 100 మీటర్ల దూరంలో గడ్డివాములతో ఏర్పాటుచేసిన మంచెల్లాంటి నిర్మాణాల నుంచి నిపుణులు నిఘా పెట్టారు. చీతాల కంటపడకుండా వాటికి అడ్డుగా తెరలు ఏర్పాటు చేసి, రంధ్రాల నుంచి కదలికలను పరిశీలిస్తున్నారు. ఫ్రెడ్డీ, ఆల్టన్, సావన్నా, సాషా, ఓబాన్, ఆశా, సిబిలి, సైసా.. అనే పేర్లు గల ఈ చీతాలు ఆరు క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలో నెల రోజులపాటు గడపనున్నాయి. ఒక ఖండం నుంచి మరో ఖండానికి వచ్చినందున ప్రొటోకాల్ ప్రకారం ఇది తప్పనిసరి.
30 నుంచి 66 నెలల మధ్య వయసు ఉన్న ఈ ప్రాణుల్లో అయిదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. అన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో, ఉల్లాసంగా ఉన్నట్లు డీఎఫ్‌వో ప్రకాశ్‌కుమార్ వర్మ మంగళవారం వెల్లడించారు. వింధ్య పర్వతాల్లో ఉత్తరం దిక్కున 750 చదరపు కిలోమీటర్లలో కునో పార్కు విస్తరించి ఉంది. 8,000 కి.మీ.ల దూరంలోని నమీబియా నుంచి గత శనివారం ఇక్కడకు తీసుకువచ్చిన చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కునో పార్కులోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చీతాల వెంట వచ్చిన ఆఫ్రికన్ నిపుణుల బృందంలో కొందరు ఇప్పటికే వెనక్కు వెళ్లారు.
పశువైద్యురాలు అనా విన్సెంట్, మరో ఇద్దరు నమీబియన్లు మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లు చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) ఉత్తమ్‌కుమార్ శర్మ తెలిపారు. భారత పశువైద్య నిపుణులు డాక్టర్ జితేంద్ర జాతవ్, డాక్టర్ ఓంకార్ ఆంచల్ వీరికి సహకరిస్తున్నారు. నిపుణుల సూచన మేరకు చీతాలకు గేదె మాంసం పెడుతున్నారు. ఈ జంతువులు మూడు రోజులకు ఒకసారి ఆహారం తీసుకొంటాయని డీఎఫ్‌వో తెలిపారు.