Cheetah in India pregnant : 74 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలు కునో నేషనల్ పార్క్‌లోని ఎన్‌క్లోజర్‌లో ఉన్నాయి. అయితే, వీటికి సంబంధించి ఓ వార్త ఆసక్తికరంగా మారింది. 'ఆశ' అనే చీతా గర్భం దాల్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆశ ప్రవర్తన, శారీరక భాష గర్భం దాల్చినట్లుగానే ఉందని.. ఎన్‌క్లోజర్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. అయితే, కచ్చితంగా నిర్ధరించలేమని పేర్కొన్నారు. ఫలితం తేలాలంటే అక్టోబర్ చివరి వరకు వేచిచూడాల్సిందేనన్నారు.
ఆశకు గర్భం! భారత్‌లో పెరగనున్న చీతాల సంఖ్య!! - భారత్‌లో చీతాలు వార్తలు 2022
Cheetah in India pregnant : నమీబియా నుంచి తీసుకొచ్చి కునో నేషనల్ పార్కులో విడుదల చేసిన చిరుతల్లో ఒకటి గర్భం దాల్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే గనక నిజమైతే మరికొద్ది నెలల్లో భారత్‌లో చీతాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
చీతా సంరక్షణ నిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ల్యూరీ మార్కర్ మాట్లాడుతూ.. 'ఒకవేళ ఆశ గనక గర్భం దాలిస్తే ఇదే తన మొదటి గర్భం. పిల్లలు జన్మిస్తే వాటికి ప్రైవసీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆవరణలో ఎండుగడ్డి గుడిసె ఉండాలి. వాటికి మానవులు కనిపించకూడదు. తల్లి ప్రశాంతంగా ఉండేందుకు దానికి మరింత స్థలం కావాలి. అప్పుడే అది తన పిల్లల పెంపకంపై దృష్టి పెట్టగలుగుతుంది' అని పేర్కొన్నారు. ఆ చీతా గర్భం దాలిస్తే గనక మరికొద్ది నెలల్లో భారత్‌లో వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
దేశంలో చీతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి 8 చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులోని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. 1948లో మధ్యభారతంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా చీతాలు తిరిగి భారత్‌లో అడుగుపెట్టాయి. వాటిలో 4 నుంచి 6 ఏళ్ల వయసున్న ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి.