తిరుమలలో బాలుడిపై చిరుత దాడి.. పరిస్థితి విషమం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వస్తోన్న బాలుడిపై చిరుత పులి దాడి కలకలం రేపింది. ఏడో మైలు వద్ద కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కౌశిక్ పై చిరుత దాడి చేసి అడవిలోకి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో స్థానికులు, భక్తులు, భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించడంతో బాలుడిని చిరుత వదిలేసింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన దంపతులు తమ కుమారుడు కౌశిక్(4)తో కలిసి కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరారు.
వీరు మొదటి ఘాట్ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో కూర్చుని ఆహారం తీసుకుంటుండగా.. బాలుడు పక్కనే ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత పులి.. చిన్నారి తలను నోటకరచుకుని అడవిలోకి తీసుకుపోయింది. అక్కడే ఉన్న దుకాణదారుడు, బాలుడి తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ పులి వెనుక పరుగులు తీశారు. టార్చ్‌లైట్లు వేస్తూ రాళ్లు విసురుతూ కేకలు వేయడంతో భయాందోళనకు గురైన చిరుత.. పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద బాలుడిని విడిచిపెట్టేసింది.
అక్కడ ఉన్న పోలీసులు తీవ్రంగా గాయపడిన బాలుడికి ప్రథమ చికిత్స అందించారు తీవ్ర గాయాలైన కౌశిక్‌ను.. తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడిని, అతని కుటుంబాన్ని టీటీడీ EO ధర్మారెడ్డి పరామర్శించారు. బాలుడి చెవి వెనుక, తలపై మరికొన్ని చోట్ల చిరుత పంటి గాట్లు పడ్డాయి. అయితే కౌశిక్ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చిరుత దాడి జరిగిన ప్రాంతంలో భద్రత ఏర్పాటు చేశామని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అలిపిరి కాలినడకమార్గంలో భక్తుల్ని గుంపులుగా పంపుతున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇటీవల కాలంలో తిరుమల ఘాట్‌రోడ్లు, నడక దారులు, పరిసర ప్రాంతాల్లో అటవీ జంతువుల సంచారం కనిపిస్తోంది. భక్తులకు ఎటువంటి ప్రాణాపాయం కలిగించనప్పటికీ బాలుడిపై దాడి చేసిన ఘటన మాత్రం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఘాట్ రోడ్డులో వాహన దారులకు రాత్రి వేళలో ఎలుగుబంట్లు, చిరుతలు కనిపిస్తూనే ఉన్నాయి. కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా తిరుమల కొండలపై అటవీ జంతువులు యదేచ్ఛగా సంచరించాయి. అప్పటి నుంచి అప్పుడప్పుడు భక్తులకు చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర వన్య మృగాలు కనిపిస్తూనే ఉన్నాయి.
ఇవీ చదవండి:Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో వరుస ప్రమాదాలు.. భయాందోళనలో భక్తులు