తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Cheating in Rajamahendravaram: రూపాయి ఇస్తే మూడు రూపాయలిస్తా.. నాలుగేళ్లు నమ్మించాడు.. రూ.15 కోట్లతో ఉడాయింపు - maddukuri pradeev kumar cheating

Cheating in Rajamahendravaram: అధిక వడ్డీ ఆశ చూపాడు. రూపాయికి మూడు రూపాయలు వడ్డీ ఇస్తానన్నాడు. నాలుగేళ్ల వ్యవధిలో.. 123 మందిని నమ్మించి మోసం చేశాడు. బాధితులు ఆ మోసగాడి వద్ద ఏకంగా 15 కోట్లకుపైనే.. పెట్టుబడులు పెట్టారు.

cheating in rajamahendravaram
రాజమహేంద్రవరంలో మోసం

By

Published : Aug 1, 2023, 10:51 PM IST

Cheating in Rajamahendravaram: రూపాయి ఇస్తే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి తిరిగి మూడు రూపాయిలు ఇస్తానన్నాడు.. మీరు పెట్టిన పెట్టుబడికి సంబంధించిన వడ్డీ సొమ్ము 3 నెలలకు ఓసారి తీసుకుంటే మూడు రూపాయిల చొప్పున వడ్డీ, ప్రతి నెలా వడ్డీ తీసుకుంటే రెండు రూపాయిల వడ్డీ.. ఇదీ ఓ మోసగాడు పన్నిన పథకం. ఇలా నాలుగేళ్ల వ్యవధిలో ఏకంగా 123 మందిని నమ్మించి నట్టేట ముంచాడో మోసగాడు. చివరకు మొత్తం నగదుతో ఉడాయించాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులును ఆశ్రయించారు. రాజమహేంద్రవరంలో ప్రకాశం నగర్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సీఐ పవన్ కుమార్, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామానికి చెందిన మద్దుకూరి ప్రదీప్ కుమార్ అలియాస్ బాలు ఎంటెక్ చేశాడు. 2018లో నగరంలోని తిలక్ రోడ్డు వద్ద షేర్‌ మార్కెట్‌ సంస్థ పేరుతో అనధికారికంగా ఓ కార్యాలయం ప్రారంభించాడు. తమ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉందని చెప్పాడు. షేర్ మార్కెట్‌కు సంబంధించి ముంబయిలో కూడా అదే పేరుతో ఓ సంస్థ ఉండడంతో అదే ప్రధాన శాఖ అని బాధితులను నమ్మించాడు.

తమ వద్ద నగదు పెట్టుబడి పెడితే సంస్థ వాటిని షేర్ మార్కెట్లో పెడుతుందని తద్వారా రూపాయికి రూ.5 నుంచి 7 రూపాయిలు వరకు సంస్థకు లాభం వస్తుందని చెప్పాడు. వాటిలో తమ పెట్టుబడి దారులకు రెండు నుంచి మూడు రూపాయిలు ఇస్తామని నమ్మించాడు. ఈ వ్యవహరంలో ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రాజమహేంద్రవరం చుట్టుపక్కల గ్రామాల వారితో పాటు కాకినాడ, జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం ప్రాంతాల నుంచి సుమారు 123 మంది అతడి వద్ద రూ.15 కోట్లపైనే పెట్టుబడులు పెట్టారు.

లక్షల్లో పెట్టుబడి పెట్టిన వారికి పూచీకత్తుగా బాండు, మరి కొందరికి చెక్కులు ఇచ్చి నమ్మించేవాడు. రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టిన ఓ బాధితుడికి మీకు ఎలాంటి భయం వద్దని తనపై నమ్మకం ఉంచాలని.. లేకుంటే తన ఇంటి పత్రాలు చూపించి వాటిని మీ వద్దనే ఉంచుకోవాలంటూ నమ్మబలికేవాడని ఓ బాధితుడు వాపోయాడు. ప్రతి నెలా మీటింగ్, పార్టీలు, పెట్టుబడిదారులకు సత్కారాలు, బహుమతులు.. ఇలా అనేక పద్ధతుల్లో వారిని బుట్టలో వేసుకున్నాడు.

గత మే నెలలో చెల్లించాల్సిన వడ్డీ సొమ్ములు కొందరికి ఇవ్వలేదు. వచ్చే నెల మొత్తం కలిపి ఇస్తానని నమ్మబలికాడు. జూన్ నెలలో సంస్థకు తాళం వేసి ఉండడం, ఫోన్‌లో ప్రదీప్ అందుబాటులోకి రాకపోవడంతో పెట్టుబడిదారులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఒక్కొక్కరిగా బయటకు రావడం మొదలు పెట్టారు. నగరంలో ఉన్న పదుల సంఖ్యలో బాధితులు జులై 16న ఎస్పీ కార్యాలయంలో ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో 22న ప్రకాశంనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details