ChatGPT Effect On Jobs : చాట్‌జీపీటీ వినియోగంలోకి వచ్చిన తర్వాత తన జీవితం మొత్తం తలకిందులైందని కోల్‌కతాకు చెందిన ఓ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు వచ్చే నెలవారీ ఆదాయంలో దాదాపు 90శాతం మేర కోతపడుతోందని వాపోయింది. శరణ్య భట్టాచార్య అనే 22 ఏళ్ల యువతి సామాజిక మాధ్యమాల ద్వారా తన గోడును వెళ్లబోసుకుంది. కృత్రిమ మేధతో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న శరణ్య భట్టాచార్య స్థానికంగా క్రియేటివ్ సొల్యూషన్స్ ఏజెన్సీకి కాపీరైటర్‌గా ఫ్రీలాన్సింగ్ చేస్తోంది. వాటి ద్వారా వచ్చిన డబ్బులతోనే తన చదువు కొనసాగిస్తోంది. ఎస్‌ఈఓకి అనుగుణంగా కొన్ని కథనాలు రాస్తూ.. నెలకు దాదాపు 20వేల రూపాయల వరకు సంపాదించేది.
చాట్‌జీపీటీ వినియోగంలోకి వచ్చిన తర్వాత శరణ్య జీవితం ఒక్కసారిగా కష్టాల్లోకి వెళ్లింది. వర్క్‌లోడ్ విపరీతంగా తగ్గిపోయింది. ప్రస్తుతం నెలకు ఒకటి లేదంటే రెండు కథనాలకు మాత్రమే ఆ ఏజెన్సీ అవకాశం కల్పిస్తోంది. ఎక్కువ కథనాలు రాసేందుకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని అడిగినా.. ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తాను చేసే వర్క్‌ను కృత్రిమ మేధతో చేయించుకుంటున్నారని.. అందుకే తనకు తక్కువ పనిని అప్పగిస్తున్నారని శరణ్య వాపోయింది. తనకు వచ్చిన ఆదాయంతో చదువు కొనసాగించడమే కాకుండా.. ఇంటిదగ్గరున్న తన 45 ఏళ్ల తల్లికి కూడా చేదోడుగా నిలిచేదాన్నని శరణ్య చెప్పుకొచ్చింది. తన జీతంలో కోత ప్రభావం కుటుంబంపైనా ప్రభావం చూపిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తన తల్లి చీరలు విక్రయిస్తారని శరణ్య చెప్పుకొచ్చింది. ఖర్చుల కోసం తల్లిని డబ్బులు అడగడం బాధగా ఉందని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఇంటి ఖర్చుల కోసం లెక్కలు వేసుకోవాల్సి వస్తోందని తన గోడును వెల్లబోసుకుంది. గతంలో ఎవరిపైనా ఆధారపడకుండా చదువు కొనసాగించినట్టు తెలిపిన శరణ్య.. కృత్రిమ మేధతన జీవితాన్ని కష్టాల్లోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. గత రెండు నెలలుగా పూర్తిగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు ఆమె వాపోయింది.